ఆదిలాబాద్

చరిత్ర :
జిల్లాలోని ప్రధాన పట్టణమైన ఆదిలాబాద్ ను జిల్లా పేరుగా మార్చబడింది. బీజాపూర్ ను పాలించిన అలీ ఆదిల్ షా పేరు మీదుగానే ఈ పట్టాణానికి ఆ పేరు స్థిరపడింది. చాలా కాలం వరకు ఈ జిల్లా ఏకీకృతముగా లేదు. జిల్లాలోని వివిధ భాగములు వివిధ కాలములందు అనేక రాజ వంశీయుల ద్వారా సిర్పూర్ కు చెందిన గోండు రాజులు, చాందా కు చెందిన రాజులే కాకుండా మౌర్యులు, శాతవాహనులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కల్యాణి – చాళుక్యులు, మొఘలులు, నాగపూర్ కు చెందిన భోసలేలు మరియు అసఫ్ జాహీల వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు . వాస్తవానికి ఇది పూర్తి స్థాయి జిల్లా కాదు. క్రీ.శ. 1872 లో ఎదలాబాద్ (ఆదిలాబాద్), రాజురా, సిర్పూర్ తాలూకాలతో రూపొందించిన సిర్పూర్-తాండూర్ పేరు కల ఉప జిల్లా. 1905 వ సంవత్సరంలో ఈ ఉప జిల్లాను ఆదిలాబాద్ ప్రధాన పట్టణముగా స్వతంత్ర పూర్తి జిల్లాగా మార్పు చేశారు. అనంతరం 2016 వ సంవత్సరములో ఆదిలాబాద్ జిల్లాను 4 జిల్లాలుగా అనగా ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలుగా విభజించారు.

పర్యాటక స్థలాలు :


కుంటాల జలపాతం:
కుంటాల జలపాతం నేరడిగొండ గ్రామము నుండి 12 కిలోమీటర్ల దూరంలో మరియు ఆదిలాబాద్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంటాల వద్ద, కడెం నది సెలయేళ్లు 45 మీటర్ల లోతుతో ప్రవహించి, అరణ్యంలోకి కలుస్తాయి. రాష్ట్రంలోనే ఇది అతి ఎత్తైన జలపాతం. ఈ అద్బుతమైన జలపాతం ప్రవహించేటపుడు కన్నుల పండుగగా అలరిస్తాయి. శీతాకాలంలో ఈ జలపాతాన్ని చూసేందుకు అనువైన సమయం. అదేవిధంగా సోమేశ్వర స్వామి అని పిలువబడే శివలింగం ఈ జలపాతం దగ్గరలో ఉంది. మహా శివరాత్రి పర్వదినాన ఇక్కడ అనేక మంది భక్తులు సందర్శించి శివ దర్శనం చేసుకుంటారు.
దిశా నిర్దేశాలు : ఆదిలాబాద్ నుండి 64 కిలోమీటర్లు. సమీప విమానాశ్రయం: హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (280 కి.మీ) సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (57 కిమీ).

పొచ్చెర జలపాతం:
పొచ్చెర జలపాతం ఆదిలాబాద్ నుండి 52 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో మరియు బోథ్ బుజుర్గ్ నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. గల గల పారే నీటి సవ్వడుల ధ్వనులు చెవుల కింపుగా వినిపిస్తూ ఒక అనీర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. రాతి వాలుల దిగువ చిన్న సెలయేళ్లు 20 మీటర్ల లోతు వద్ద ఒక పెద్ద మనోరంజకమైన కొలనును ఏర్పరుస్తాయి. పొచ్చెర జలపాతాన్ని సందర్శించడానికి శీతాకాలము అనువైంది.
దిశా నిర్దేశాలు : సమీపంలోని విమానాశ్రయం: హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (280 కి.మీ) సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (47 కిమీ).

జైనథ్ దేవాలయము
ఈ ఆలయం ఆదిలాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు మీద పెట్టబడింది. ఈ ఆలయము పల్లవులలో ముఖ్యుల ద్వార నిర్మించబడిందని 20 శ్లోకములతో కూడిన ఆలయ శిలాశాసనం సూచిస్తుంది. ఈ ఆలయం జైన శైలి నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవం, కార్తీక శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి (అక్టోబర్ –నవంబర్) వరకు జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
దిశా నిర్దేశాలు : ఆదిలాబాద్ నుండి 20 కిలో మీటర్లు సమీప విమానాశ్రయం: హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (341 కిమీ) సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (20 కిమీ).
నాగోబా జాతర కేస్లాపూర్ :
నాగోబా దేవాలయము ఆదిలాబాద్ నుండి కేస్లాపూర్ 35 కిలోమీటర్లు మరియు ఉట్నూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇచ్చట ప్రసిద్దమైన నాగోబా ఆలయం ఉంది. ఇక్కడ శేషనాగ్ (సర్ప అవతారం లో దేవుడి) దర్శనం ఇస్తాడు. ఈ పవిత్ర దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. నాగోబా జాతర పుష్య మాసములో (డిసెంబరు –జనవరి) మధ్య కాలంలో జరుగుతుంది. ఈ ప్రఖ్యాతమైన జాతరలో వివిధ కులాలు మరియు మతాలకు చెందిన అనేక మంది భక్తులు పాల్గొంటారు. ఈ జాతర లో నాగ దేవతకి పూజలు జరుగుతాయి . జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మరియు పొరుగున ఉన్న మహారాష్ట్రాలోని గోండులు, ఇతర తెగల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
దిశా నిర్దేశాలు : ఆదిలాబాద్ నుండి 32 కిలోమీటర్లు. సమీప విమానాశ్రయం: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (326 కిమీ). సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (32 కిమీ).
గాయత్రీ జలపాతం :
గాయత్రీ జలపాతం ఆదిలాబాద్ లోని ప్రసిద్ధ కుంటాల, పొచ్చేర జలపాతాల గురించి మీరు విని ఉంటారు. కానీ అదే జిల్లాలో ప్రాచుర్యం చెందని గాయత్రీ జలపాతము కూడా ఉంది. ఈ గాయత్రీ జలపాతము కడెం నదిపై ఉంది. ఈ నది గోదావరి నదికి ఉపనది. ఈ జలపాతము మానవ దృష్టికి అందనంత దూరములో దట్టమయిన అడవి లోపల ఏకాంత ప్రదేశంలో ఏర్పాటైంది. ఆదిలాబాద్ జిల్లా- నేరడిగొండ మండలము- తర్నంఖుర్ద్ అనే గ్రామము నుండి సుమారు 5 కిలో మీటర్ల దూరములో ఈ జలపాతము కలదు. జలపాతానికి చుట్టుపక్కల నివసించే గ్రామస్తులు ఈ జలపాతాన్ని గదిద గుండం లేదా ముక్ది గుండం అని పిలుస్తుంటారు. 100 మీటర్ల ఎత్తు నుండి లోయలోకి జాలువారే అద్భుత దృశ్యం వీనులకు విందు చేయక మానదు. ప్రకృతి మాత యొక్క ఇంతటి కళాత్మక సృష్టికి సాక్షులుగా మన మానవమాత్రులం ఆ ప్రకృతి సౌందర్యానికి వీక్షించే, అలౌకిక భావానికి లోనయ్యే కృపా పాత్రులం అని అనుకోక తప్పదు.
ఆహ్వానించే జలపాతానికి ఎదురుగా నిలబడినప్పుడు, అందమయిన జాలు వారే స్వచ్చమయిన నీటిని ఆ మడుగు కింద చూడవచ్చు. పైనుండి లోయలోకి జాలు వారే నీటి చినుకులు చెక్కిలి పై పడే దృశ్యం అద్భుతముగా ఉంటుంది !!! అతిథులను ఆహ్వానించే ఆధునిక విధానము !!! జలపాతము యొక్క ఉపరితల దృశ్యాన్ని చూడటానికి పైకి ఎక్కి నప్పుడు ఆ ముగ్ద మనోహరమయిన దృశ్యానికి, ప్రకృతి అందాలకు బందీలమయిన భావన కలుగుతుంది .
దిశా నిర్దేశాలు : హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు 257 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి ద్వారా ప్రయాణిస్తే మీరు నేరడిగొండ గ్రామానికి చేరుకోవచ్చును. నేరడిగొండ గ్రామానికి చేరుకున్న తరువాత, మీరు 6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తూ కుప్టి గ్రామానికి చేరుకోవలసి ఉంటుంది, ఇక్కడ మీరు తర్నాం గ్రామానికి చేరుకోవడానికి సరైన మలుపు తీసుకోవటానికి సూచించే ఒక సైన్ బోర్డుని కనుగొంటారు.దుమ్ము రహదారిపై 2 కి.మీ.ల దూరం మరియు డ్రైవ్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. తర్నాం గ్రామంలో, జలపాతాలకు చేరుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. మీరు మార్గనిర్దేశం చేసేందుకు గ్రామస్థులతో కలిసి ఉండాలని నిర్ధారించుకోండి, లేదా మీరు దట్టమైన అడవిలో కోల్పోతారు .
భారత దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17 న విముక్తి చెంది 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ లో కలిసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు కలవు. శాతవాహనులు మరియు కాకతీయలకు తెలంగాణ మాతృభూమిగా ఉంది. కరీంనగర్ లోని కోటిలింగల ధరణికోటకు ముందు శాతవాహనులు మొదటి రాజధాని. కోటిలింగల వద్ద జరిపిన త్రవ్వకాల్లో శాతవాహనులు చక్రవర్తి సిముఖా నాణేలు బయటపడ్డాయి. .
సోర్స్ : తెలంగాణ స్టేట్ పోర్టల్