తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌ జిల్లావాసులు మృతి

వారంతా తిరుమలేశుని దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు

తిరుపతి: వారంతా తిరుమలేశుని దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లోని  తిరుపతి  జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లేకు  చెందిన ఓ కుటుంబం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లింది. శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు తిరుపతి జిల్లా మేర్లపాక వద్ద బస్సును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలతోపాటు చిన్నారి మృతిచెందింది. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు వారిని తిరుపతిలోని రుయా దవాఖానకు తరలించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని పోలీసులు తెలిపారు. బస్సును ఢీకొట్టిన కారు.. రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లోకి వెళ్లిందన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Previous article