ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి..

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన నెలకొంది

హైదరాబాద్ ; జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన  నెలకొంది. సరదా కోసం  ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. వీరిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. చనిపోయిన వారిని అఫ్రీన్(17),  సమీర్(8) నౌషిన్(7), రిహన్(15)గా గుర్తించారు. 
మృతులంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారు. వీరు కొన్నాళ్ల క్రితమే కర్నూలుకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి గడిపారు. 
కృష్ణా నదిని చూసేందుకు సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న నది వద్దకు 11మంది ఆటోలో వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత స్నానం చేయాలని భావించి.. లోపలికి వెళ్లారు. లోతట్టు ప్రాంతానికి వెళ్లడంతో అక్కడే ఉన్న బురదలో ఇరుక్కుపోయారు. దీంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో  తీవ్ర విషాదం నెలకొంది.

Previous article