రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం : సీఎం ప్రకటన
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామన్న మమతా బెనర్జీ
ఒడిశా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. కాగా, తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.
అంతేకాంకుండా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని.. ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని మమత చెప్పారు. రైలు దుర్ఘటన అంశంలో ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనన్న దీదీ.. క్షతగాత్రులు, వారి కుటుంబాలకు సాయం గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు.