మీ సందేశం తెలుపగలరు / Post Your Message


Messages

సాహితి శిఖరం

నీ రూపము మా మదిలో
సారూప్యము నిలిచినట్లు
సంభాషణలన్.
తారా స్థాయిన జలజము
ప్రేరే పించగ సుమధుర
పిలుపుల యందున్.

ఒక జలజము సుర గంగను
ఒక జలజము విష్ణుచేత
      నొప్పారంగన్
ఒక  జలజము శ్రీ కరమున
ఒక జలజము జనుల శిరము
      నొప్పెను నేడున్

 

డా. కె. బాలస్వామి
2021-11-24 13:41:30


Literary peak📚
- Sri Jalajam -

 Jalajam Satyanarayana is a renowned academician in the field of education. Jalajam Satyanarayana is a well-known academic in the field of education during the last 50, 60 years, as well as in extensive study, comparative study of many issues, trends in politics, contemporary issues and contemporary issues in the form of analytical commentaries and critiques.  While working in the field of education, he is well known not only as a sociologist and literary figure but also as a good orator who has given extensive lectures on any subject matter.  Although his literary essay, which once shed light on our message, has been a bit of relaxation for the past decade --- with a dichotomous innovation, it has adapted the famous poems of famous Hindi and English poets and introduced their poetry to Telugu literary lovers.  The famous Urdu poet Faiz Ahmad adapted poetry and served the sweetness of Farsi poetry in Telugu.  

Poems like Bhakta Kabir Dasa, Vedana (Anso adaptation) and Bilhaniyam (from Sanskrit) are colorful in Telugu language beauty and most beautifully decorated in Telugu Wakit.  Former Prime Minister Vajpayee's poetry adapted by Jalajangar__ "Peak" is the most popular _ Vajpayee translated the poetic spirit in a simple, beautiful and profound philosophical style.  In translation_the feeling is most natural without spoiling the source ... wrote the poem by filling himself with the emotion of the original writing.  A passage from a poem by Vajpayee 'Jalajam' takes on any form in the psyche and how much emotion is elevated _ This footnote clearly shows some of the footnotes in the poem --- Adhikara Peetham ---Throne Stained with the blood of the innocent

  The thirst for power contaminated with graveyard dust Worse than bloodlust  Ours is a culture of five thousand years  Proud?  Cry? This poetic foot is a visual mirror of the misery we experience today.  The political anarchy of the day is no different from the political anarchy of today.  Original author 'Vajpayee' The intensity of the pain is the mental crisis, the Telugu words - to express the water as strongly, as little, as wet - with the sensation in the water - the poem is poured into this form.

 Many aspects of Jalajam poetry - many aspects of life in expression, the confluence of experiences, the most emotionally responsible poetic stunts, the skill to express the sweetness of the Telugu language in the most beautiful way - Poetic acrobatics appear as cocoons in his translated works A tendency of its own - to appear in all poetry It is no exaggeration to expect Jalajangari's works to be published as comprehensive volume — a permanent literary repository.

(I have translated into English an article written by K. Laxman Goud, a former lecturer of the famous poet)
             🙏🌹

Ravi Chanchala (President : Paalamuru Kavana Vedika)
2021-11-24 13:40:10


కనదగు జలజా కృతులను
వినదగు జీవిత విలువలు
విస్తారముగన్
మనదగు ఆదర్శముగా
జనదగు జలజంబు పథము
జాగృతి తొడన్.

 

డా. కె. బాలస్వామి
2021-11-17 22:01:48


***  తేటగీతి మాల  ***

ప్రసిద్ధ కవి,  విద్యావేత్త, కాళోజీ హాల్ నిర్మాత, విశ్రాంత ఉపన్యాసకులు... 
జలజం సత్యనారాయణ గారిని స్మరిస్తూ... 

సత్యనారాయణ జలజం సవ్యసాచి          
అరయ పాల్మూరి  సాహిత్య సురభి యతడు 
కవుల పాలిట సిసలైన కల్ప తరువు
మరువ బోమయ్య మీ మాన్య  మధుర కవిత!!

ఆర్య ఆచార్య పదవిలో నద్భుతముగ
నిలిచి గెలిచిన మొనగాడు జలజమన్న 
శిష్య తతులను మేల్కొల్పు శిఖరమీవు 
ముగ్ధమోహన సత్కావ్య ముకురమీవు!!

కావ్యసాగర మందు సుశ్రావ్య ఫణితి
గళము ఎత్తిన సుమధుర గాన మురళి
స్వర్గ లోకాన సత్కావ్య సదసు నందు
కైత విన్పించ వెడలిన కవి వతంస!!

పాఠశాలలు స్థాపించి భాసురముగ
విద్యనభివృద్ధి చేసిన విమల చరిత   
ప్రగతిశీలపు దారిలో పయనమౌచు 
సుగతి సాధించి చూపిన సూత్రధారి!! 

వాడ వాడల నీ యనువాద కృతులు 
ప్రజ్వరిల్లగ మార్మోగె ప్రణవమటుల
సుకవి గౌడన్న సాహితీ సూక్తులన్ని 
అఖిల లోకాన దివ్వెలై అలరుచుండు!!
 
ఆత్మ శాంతితో విలసిల్లు నాత్మ విదుడ 
స్వర్గ లోకాన్ని ఏలుకో సత్యమన్న 
జగతి సత్కావ్య శోభతో జనులు మెచ్చ 
ప్రగతి పథమున వర్దిల్లు భాసురముగ!!

 

జి. శాంతా రెడ్డి, పాలమూరు
2021-11-17 13:45:36


ఉన్నత విలువలు గలిగిన
ఉన్నత శిఖ రాల వెలిగి
    ...     ఔనత్యంబున్
ఉన్నత చరితుడు జలజము
ఉన్నత సత్ కీర్తు లందు
           ఉడుపతి జే రె న్

 

డా.కె. బాలాస్వామి.
2021-11-17 13:44:59


Dismal News-

Despite of lighting
"Deepavali",
Morning breeze did 
send the news of 
darkness drooping 
drops over.
No more is JALAJAM,
Of it, Maanasasarovar does seem sunken.
Thou art workaholic to have dareness.
Thy impeccable heart carved out goodness of 
Palampur Telugu Mother.
Thou hast obtained  applause by translating 
Vajpayee's poetry,
Since the day thy breathing last ,
Sky in Palampur stii look gloomy.
Of late, thy appearance 
looking young in 90's  
in zeal and enthusiasm somewhat annoyed us.
Godess Sarswati does shed her tears ,
For thy absence, Palampur scholars have been made orphans.
Look ! Thy smiling countenance as glowing star from the sky stiil looking at us pitifully leaving all in desperate condition 
saying goodbye.
For thee, l bade tearful adieu.
🙏🙏🙏🙏🙏🙏🙏

J. Sharanappa
2021-11-17 13:43:12


అలుపెరుగని యోధునికి అక్షర నివాళి

పాలమూరున ఉద్భవించిన పాలవంటి స్వచ్ఛమైన మూర్తిమత్వం

జ్ఞాన తటాకాన వికసించి ఏనాటికీ వసివాడని జలజం

సాహితీ సౌరభాలను విరివిగా వెదజల్లే వైనం

ఉదయ భానునిలో లీనమై ప్రసరిస్తోన్న జ్ఞాన కిరణం

దీపావళినాడు దివ్వెయై దైవసన్నిధి చేరినా,

దేదీప్యమానమైన ప్రగతిభావ జ్ఞానకిరణాలు

"అనల" మందు చేరి వెలుగులు రువ్వుతూ 

కీర్తి "శిఖరం" నుండి శాశ్వత స్థానాన్ని చాటుతున్నవి

అభ్యుదయ భావాలు, మానవీయ విలువల పారదర్శకతతో

మానవుడే మా సందేశమని చెప్పేను సంపాదకీయ సంకలనం

కబీరు గీతగా ఆవిష్కృతమై కనులకు వెలుగైనది కబీరుకవిత్వం

మనసున వేదన నణచి   చదువగలమా! ఆంసు అనువాద కవిత్వం !

కాలనాళికలో సుజల స్రవంతిగా పారుతున్న స్మృతి ప్రవాహాలు

అలుపెరుగని యోధత్వానికి తార్కాణమైనవెన్నో పాళీప్రయోగాలు

సాహితీ సరస్వతికి అలంకృతమై విరాజిల్లే విజ్ఞానజలజాన్నిలా సంస్మరిస్తూ ఆర్పిస్తున్నాం అక్షర నివాళులు..

 

జె.పద్మావతి, లుంబినీకుటుంబం
2021-11-17 13:40:52


ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త, సంపాదకులు, అనువాద 'శిఖరం', లిటిల్ స్కాలర్ విద్యాసంస్థల అధినేత, తెలంగాణ ఉద్యమనాయకులు కీ.శే. శ్రీ జలజం సత్యనారాయణ గారు అకాలమరణం యావత్తు తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను.  ఓం శాంతి.
 

చిలావర్ సంతోష్  
2021-11-14 05:30:13


తారయైజలజము తారమండలమేగ
కవుల హృదయమెల్ల కలతజెందె
శోకతాప్తమయ్యి శోకించె పాల్మురు
జలజమికను లేక కలతజెందె


 

ఆర్ చెన్నయ్య 
2021-11-13 16:38:42


జీవన సమరము నందున
భావిని గెలుపొంది నట్టి
భాస్కరుడై తా
నావిష్కరణము చే  మే
ధావిగ అనుసృజన కావ్య
ధారలు పొంగన్.

తెలుగు భాష ఘనత
తెలిపను జీవితం
ధార పోసి నట్టి ధన్య జీవి
వేల కావ్యములను
వెలుగుకు దెచ్చెను
తెలుగు వాడు కాదు వెలుగు వాడు.

నిత్యము పదిసార్లైనను
సత్యముజలజమ్ము నామ
సంస్మరణంబుల్
నృత్యము జేయగ కవితా
దిత్యుని కవితలు మనమున
దీప్తులు జిందన్.

అక్షర శిఖరము కూలెను
సాక్షిగ కావ్యా లు వెలిగె
... సాహితి జగతిన్
సుక్షిత కవితలు రాసెడు
దక్షుడు జలజమ్ము నేడు
తరతర ములకున్.

డా.కే. బాలాస్వామి
2021-11-13 16:37:23


WITHERED LOTUS! 

On the day of celebration Of Lights, 
A piece of News of Darkness, 
When is said, no more is JALAJAM, 
Of it, Manasasarovar seems has sunken. 

In the Morning, when drops are drooping over, 
I have guessed what is it for, 
The Day has been broken with agony, 
With no reason at all. 

Once, there lived by name JALAJAM SATHYA NARAYANA, 
For a decade, his name is seen uttered, every day, 
Of make up of his mind, 
He used to travel ten scores of Miles, so lucidly, 
As if it is a visit to neighbourhood,
Amist, To and Fro travel between Palamoor and Bhaghyanagar, 
He owns Comradeship of genre of Travelogue Literature,
Cherish to live amicably - is his never ending Story. 

Being establishing School, 
He has provided Education to the poor students, 
A champion against the Federal Culture. 

Several turns of his Life, 
Have been the glitters of his bright personality, 
Despite, having crossed eight scores of Age, 
He treads ahead of youth, so sharply. 

"Of being a Man is our Message " suggests that old poet, 
Showers Lights of mercy is this Literary Son, 
Having begun his poesy with "Anula" 
His one's has never seen lost the feature of fire, 
In the great mission of Translation, 
His pieces of Works have been submitted to the fire, gorgeously. 

A creator, who turns Kabir into a Telugu one's, 
On being translating him, 
A Brave Heart, who scales Summits by feet of Vajpayee Poetry, 
When one observes his Recreation, 
Faiz himself would have wounderd,
With his matured Personality, 
Has seen ploughed thousands of Papers of Wisdom. 

He isn't a Professor, 
Not for sake of PhDs, 
No chance of getting promotions, 
A Champion, 
 who makes dear Wisdom, 
To have run into his hot blood veins of his body. 

When I had been to China, 
In the Airport, 
He had made such Hustle and Bustle, 
As if he himself had been travelling to, 
Of his very arrival to my Home, 
He used to speak to the steps Building, 
Massaging them, each of it, with his gentle foot. 

My Friend, 
Owns comradeship with Alphabet, 
A perpetual Personality, 
His very absence on the Day, 
Makes Mahabubnagar Sky, look still Gloom, 
For Him, My tearful, Adieu. 

Translated into English by
Sane shivashanker 

Prof. N. Gopi
2021-11-13 16:34:27


మానవీయ సాహితీ శిఖరం

-- శ్రీ జలజం -

జలజంగా ప్రసిద్ధులైన --జలజం సత్యనారాయణ విద్యారంగంలో ఒక సుప్రసిద్ధ అకాడమిసియన్ గత 50 ,60 సంవత్సరాల కాల వ్యవధిలో సుదీర్ఘ విద్యా ప్రస్థానమే కాకుండా, విస్తృతమైన అధ్యయనంలో, సామాజిక వ్యవస్థలోని అనేక విషయాలను, పోకడలను, రాజకీయాల తులనాత్మక పరిశీలన, సమకాలీన సమస్యల గురించి --- విశ్లేషణాత్మక  వ్యాఖ్యానాలు, విమర్శల రూపంలో ఎన్నో రచనలు చేశారు.

విద్యా రంగంలో విశేష కృషి చేస్తూనే, ఒక సామాజిక వేత్తగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులడమే కాకుండా, విషయ విశ్లేషణ ప్రధాన అంశంగా ఏఅంశం తీసుకున్నా  విస్తృతంగా ఉపన్యసించి ఒక మంచి వక్తగా రాణించారు . ఒకనాటి అనల మానవుడే మా సందేశం నుంచి వెలుగులీనుతున్న వీరి సాహిత్య వ్యాసంగం కాస్త విశ్రమించినప్పటికీ గత దశాబ్ద కాలంగా--- ద్విగుణీకృత నూతనోత్సాహంతో, సుప్రసిద్ధ హింది, ఆంగ్ల కవుల ప్రసిద్ధ కావ్యాల్ని అనుసృజన చేసి వారి కవితాత్మల్ని తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేశారు .

సుప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ కవిత్వాన్ని అనుసృజన చేసి--- ఫారసీ  కవిత్వంలోని మాధుర్యాన్ని తెలుగింట వడ్డించారు. భక్త కబీరు దాసు, వేదన (ఆంసూ అనుసృజన) బిల్హణీయం (సంస్కృతం నుంచి) లాంటి కావ్యాలను తెలుగుభాషా సౌందర్యంలో రంగులద్ది, అత్యంత రమణీయంగా తెలుగు వాకిట్లో అలంకరించారు . జలజంగారు అనుసృజన చేసిన మాజీ ప్రధాని వాజపేయి కవిత్వం_  "శిఖరం" అత్యంత జనాదరణ పొంది _ వాజపేయి, కవితాత్మను సరళ సుందరంగా గాఢమైన తాత్విక ధోరణిలో అనువదించారు.

అనువాదంలో భావం మూలం చెడకుండా అత్యంత సహజంగా-- మూల రచనలోని భావోద్వేగాన్ని తనలో నింపుకొని __కవితా రచన చేశారు. వాజపేయి కవిత్వంలోని ఒక కవితా ఖండిక 'జలజం'  మనోవీధిలో ఏ రూపం సంతరించుకొని  ఎంత భావం గాంభీర్యత నింపుకుందో _  ఈ కవితా ఖండికలో  ప్రస్ఫుటంగా గోచరిస్తుంది--- అధికార పీఠం--- అనే కవితలోని కొన్ని పాదాలు
అధికార పీఠం
నిర్దోషుల రక్తంతో తడిసింది
శ్మశాన దుమ్ము ధూళితో మలినమైంది అధికార దాహం
రక్తదాహంకంటే నికృష్టమైంది
మనది ఐదువేల  సంవత్సరాల సంస్కృతి
గర్వపడాలా? ఏడ్వాల?
 _ మనం అనుభవిస్తున్న నేటి దుస్థితికి ఈ కవితా  పాదం ఒక దృశ్యమాన దర్పణం. ఆనాటి రాజకీయ అరాచకం నేటి రాజకీయ అరాచకానికి పెద్ద తేడా లేదు. మూల రచయిత 'వాజపేయి'వేదనలోని తీవ్రత మనో సంక్షోభం ,తెలుగు పదాలు_ ఇంకాస్త బలంగా, ఇంకాస్త,ఆర్ద్రంగా నీళ్ళు వ్యక్తీకరించడానికి- జలజం లోని సంవేదనతోడై- కవిత ఈ రూపంలో పురుడు పోసుకున్నది.

జలజం కవిత్వంలో ఎన్నెన్నో అంశాలు- భావవ్యక్తీకరణ లో అనేక జీవన పార్శ్వాలు, అనుభూతుల సంగమం, అత్యంత భావాత్మకంగా బాధ్యత  సంతరించుకున్న కవిత్వ విన్యాసాలు తెలుగు భాష మాధుర్యాన్ని అత్యంత సుందరంగా ఆహ్లాద భరితంగా ఆవిష్కరించగల నేర్పు -
కవిత్వ విన్యాసాలు ఆయన అనువాద రచనలలొ కోకొల్లలుగా దర్శనమిస్తాయి
తనకే సొంతమైన ఒక ఒరవడి -అన్ని కావ్యాలలో దర్శనమిస్తాయి
జలజంగారి రచనల్ని ఒక సమగ్ర సంపుటంగా వెలువరించి-ఒక శాశ్వత సాహిత్య భాండాగారంగా రూపొందాలని ఆశించటంలో అతిశయోక్తి లేదు.

(జలజం సంతాపసభ నవంబర్ 14 ఆదివారం  జె జె ఆర్ గార్డెన్స్ మహబూబ్ నగర్) 

కే.లక్మణ్ గౌడు
2021-11-13 16:18:48


సద్గుణ సంపన్నుడు, పరోపకారి మరియు మృదు భాషసద్గుణ సంపన్నుడు, పరోపకారి మరియు మృదు భాషి,
కి. శే.సత్యనారాయణ గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం! వారు చేసినటువంటి పుణ్య సుకర్మ ల వలన వారికీ పరమేశ్వరుడు పర లోక మందు సథ్గతులు కలిగించు గాకా!ఊహించని సంఘటన అకాల మరణం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకోనుచున్నాము.

రామకృష్ణ ఎస్
2021-11-12 21:06:48


A Nobleman who worked for the welfare of Mahbubnagar. I am deeply shocked. But for Corona, I would have gone to Mahbubnagar from Bangalore to see him. Let his soul rest in peace.

Prof. Thanikasalam
2021-11-12 20:31:32


మాన్యులు కీ॥శే॥జలజం గారి స్మృతిపథాలే స్ఫూర్తిదాయకాలై మనందరికీ జ్ఞానకిరణాలుగా ప్రకాశిస్తూ వెలుగులు రువ్వావుతాయి. వారి భౌతిక దర్శన భాగ్యం లేకపోయినా, మనందరి హృదయాలలో సుస్థిరస్థానం కలిగిన చిరంజీవులే.
జలజంగారి పవిత్ర ఆత్మకుశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.....

 

పద్మావతి జోషి
2021-11-11 09:35:51


*** భాష్పాంజలి***

ప్రసిద్ధ కవి,  విద్యావేత్త, కాళోజీ హాల్ నిర్మాత, విశ్రాంత ఉపన్యాసకులు... 
జలజం సత్యనారాయణ గారిని స్మరిస్తూ... 

తే. గీ. 
సత్యనారాయణ జలజం సవ్యసాచి          
 సుకవి పాల్మూరు సాహిత్య శిఖర మతడు
మరువ బోమయ్య మీదు మమత  నెపుడు
కరములెత్తి మొక్కెదను మీ  కవనమునకు! 

ఇష్టపడె ఉపన్యాసక వృత్తిగాని 
తన ప్రవృత్తి సాహితీ దారి నడిచె
మీదు విద్యార్థుల కెపుడు మెచ్చునట్లు 
బోధ సల్పినట్టి బుధులు మీరు 

సాహితి సముద్రమందు స్నానమాడి
రచనలను చేసె తనుఅవిశ్రాంతముగ
అతని  అనువాద కృతులెన్నొ నచ్చువేసి
సాహితీ వేత్త గాను ప్రశస్థి పొందె!

అయ్య పాఠశాల తెరిచె నద్భుత ముగ
ఆంగ్ల మందు దిట్ట అరుంధతమ్మ గారు
భర్తకు తగిన భార్యయై బాగనడిపె 
ముచ్చటగాను ముగ్గురు  ముత్యములలరి 
తండ్రి పేరు నిలిపిన తనయలైరి! 

నేటి రాజకీయ వ్యవస్థ గిట్ట నితడు 
మానవత్వమునకు తను మారు పేరు 
తాను తెలంగాణ సాహితీ తపన శీలి
విధికి తలవంచిన గొప్ప వినయమూర్తి 

 


 

జి.శాంతా రెడ్డి
2021-11-11 08:08:43


బంగారు తెలంగాణ అంటే ఏంటి ?

మట్టి, పుట్ట, చెట్టూ, చేమ, నీరు, నిప్పు 
అంతా బంగారమై పోతుందా ? 
మట్టిని బంగారమనొచ్చు కానీ 
అంతమాత్రాన మట్టి బంగారం కాదు 
అమూల్యమైనది ఏదైనా బంగారమే 
అన్నీ ఎట్లున్నవో అట్లాగే వుంటాయి.

బంగారు తెలంగాణ అనేది 
ఒక భావం మాత్రమే 
భావాలు అందంగా, సొంపుగా, తియ్యగా వుంటాయి 
వాస్తవాలు మాత్రం వేరుగా వుంటాయి 
భావంలో స్వచ్ఛత, సమగ్రత వుండాలి 
దాని రూపకల్పననే కాదు 
ఆచరణ, అమలు పక్కాగా వుండాలి.

కట్టె కట్టెగానే వుంటది 
గంధం చెక్క చెక్కగానే వుంటది 
సుగంధం మాత్రం అందులో వుంటది. 
అదే దాని ప్రత్యేకత.

తెలంగాణ
బంగారు తెలంగాణ కావాలంటే 
అది సమన్యాయం, సమగ్రాభి వృద్ధితో 
చందనం చెక్క కావాలి 
అప్పుడే మట్టి తెలంగాణకు 
పరిమళ మబ్బి బంగారు తెలంగాణవుతుంది 
లేకపోతే, నెయ్యిలేని 
నేతి బీరకాయవుతుంది.

 

జలజం సత్యనారాయణ
2021-11-11 08:04:17


పాలమూరు జలజం  

అమావాస్య నిశిలో
ఓ సాహితీ దీపం మలిగింది. 

అతను
రెండు తరాల వారధి
తొలి,మలి ఉద్యమాల సారథి.

నవ్వే పువ్వు
అతని చిరునవ్వు.

అతని గళం
మాట్లాడే మౌనం.

అతని కలం రగిలే అనలం
అతని ఆలోచన ఉద్యమ కెరటం.

చేయూతనిచ్చిన విద్యా ప్రదాత
చేతికి ఎముక లేని దాత.

అతను
మానవతకు ఎత్తిన జెండా
బహుజనులే అతని ఎజెండా.

ఉద్యమం, కవిత్వం
అతని జీవితం.

అతను,
రెండు పాళీల కలం
సృజన ,అనుసృజన.

దీనజన వేదనకు అనువాదకుడు.
ఫైజ్ కవితలా ప్రవహించాడు.

శృంగార బిల్హణీయమై 
మైమరిపించాడు.
కబీర్ గీతలా 
మదిలో నిలిచి పోయాడు.

అతను,
పాలమూరు సాహితీ సరోవరంలో
విరిసిన జలజం.

నిలువెత్తు సాహితీ శిఖరం.
అతను ఎక్కడున్నా
కవిత్వమై ధ్వనిస్తూ ఉంటాడు.!!
        


 

కమలేకర్ శ్యాం ప్రసాద్ రావు
2021-11-11 07:46:29


Jalajam loved me. He never allowed me to spend and waste money. He is unforgettable. He never talked ill of others. He had great thoughts. unfortunately, he had no support. I am lucky to have him as..  a friend. I pray to God to give his happiness to his family.

Shanker a true  friend  of jalajam.

Shanker
2021-11-11 07:45:03


జలజ వికాసం 

అతడు
నిలువెత్తు శిఖరం
పాలమూరు సాహితీ కెరటం
పాత కొత్త తరాలతో
పెనవేసుకున్న బంధం
బహుభాషా కోవిదుడై
సాహితీ క్షేత్రాన్ని
సుసంపన్నం చేసాడు
కలం యోధుడై 
కమనీయ కావ్యాలకు
పురుడు పోశాడు
అనువాదామృతాన్ని
తెలుగు పాఠకులకు అందించి
తనకుతానే సాటని
నిరూపించుకున్నాడు
విద్యావనానికి తోటమాలియై
ఉత్తమ పౌరులను
జాతికి అందించాడు
సాహిత్యం
సామాజికం
రాజకీయం
విద్యారంగం
రంగమేదైనా
జలజ వికాసమే
అతడున్నచోట
అంతా నిత్యనూతనమే

     

గుముడాల చక్రవర్తి గౌడు
2021-11-10 15:23:38


మిన్నగ సాహితి శోభలు
అన్నా నీమనసు వెన్న
అందరి నోటన్
కన్నుల నిలిచిన జలజము
వెన్నెల జాబిల్లివన్న
విభ వో న్నతులన్.

 

డా.కే. బాలస్వామి.
2021-11-10 07:05:38


జీవన సమరము నందున
భావిని గెలుపొంది నట్టి
భాస్కరుడై తా
నావిష్కరణము చే  మే
ధావిగ అనుసృజన కావ్య
ధారలు పొంగన్

దివిజ కవివరుల గెలువగ
దివికే గె జలజము కవిత
దిగ్గజ లదురన్
భువి పా లమూరి ప్రతిభను
దివి జేంద్రుడు మెచ్చి యి చ్చు
దివ్యత్వం బున్.

డా.కే. బాలస్వామి
2021-11-09 16:30:49


మహాకవుల అనుసృజకుడు

పాలమూరు గడ్డ మీద పుట్టిన అరుదైన వ్యక్తి జలజం సత్యనారాయణ. పాఠశాల ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన బోధనా జీవితం జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడి స్థాయికి ఎదిగింది. ఆయన క్రమంగా సామాజికవేత్తగా, సాహితీవేత్తగా ఎదిగారు. మర్రి చెన్నారెడ్డి మొదలుకుని కెసిఆర్ దాకా ఎందరో రాజకీయ నాయకు లతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేవారు.

బహుజన పక్షపాతిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. అర్ధశతాబ్ధం పైగా లిటిల్ స్కాలర్ వంటి విద్యాసంస్థను నిర్వహిస్తూ వేలాది మంది పేద, మధ్యతర గతి పిల్లలకు ఉత్తమవిద్యను అందించారు. మరో వైపు అభ్యుదయ ప్రగతిశీల భావాలతో కవిత్వ రచన చేశారు. 'అనల' వారి మొదటి కవితా సంకలనం 'మానవుడే మా సందేశం' కవితా సంకలనానికి సంపాదకునిగా వ్యవహరించారు. విప్లవ కవి వరవరరావుతో కలిసి పనిచేశారు.

తెలంగాణ సాహిత్య చరిత్రలో ఎవరూ చేయనంతగా ఇటీవల అనువాద కవిత్వాన్ని వెలువరించారు. మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి కవితలో ఎంపిక చేసిన వాటిని 'శిఖరం' అనే కవితాసంపుటిగా ప్రకటించారు. కబీరు కవిత్వాన్ని కబీరు గీతగా ఆనుసృజన చేశారు. ఇంకా అంశును 'వేదన' పేరిట అనువదించారు. బిల్హణీయాన్ని, ఫైజ్ కవిత్వాన్ని తెలుగు చేశారు. ధ్వని సాహితీ సంస్థను స్థాపించి, వందలాది సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. సాహిత్య సభల నిర్వహణ కోసం కాళోజి హాలు నిర్మించి కవులకు ఉచితంగా ఇచ్చేవారు.

ఎనిమిది దశాబ్దాల జీవితకాలంలో అన్ని సామాజిక, అస్తిత్వ ఉద్యమాలల్లో ప్రత్య క్షంగా పాల్గొని ప్రేరణ కలిగించిన ఉద్యమ కారుడు జలజం దీపావళి రోజున ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. కాళోజి, దాశరధి వంటి కవులతో సన్నిహితంగా మెలిగి ఎంతోమంది కవులకు దిశానిర్దేశం చేసిన క్రాంతదర్శి జిల్లా సాహిత్య, సామాజికరంగాలపై తనదైన ముద్రవేసిన జలజం కన్నుమూయడం సాహిత్యలోకానికి తీరని లోటు

 

కోట్ల వెంకటేశ్వర రెడ్డి
2021-11-09 11:56:52


మన మనస్సును మనమే అడగాలి

ఏం పోగొట్టుకున్నాం, 
ఏం సంపాదించుకున్నాం 
బతుకు బాటలో కలుస్తారెందరో, 
విడిపోతారెందరో

నాకు ఎవ్వరితో లేవు వివాదాలు 
కానీ అడుగడుగులో దగా పడ్డాను 
గత స్మృతుల్ని నెమరేస్తూ 
జ్ఞాపకాల మూట విప్పి వెదుకుతాను

ఈ పృథ్వి లక్షల సంవత్సరాల ప్రాచీనమైనది జీవనగాథలు అనంతమైనవి. 
ఈ శరీరానికి కొన్ని హద్దులున్నాయి. 
కేవలం శతశరద్ పూర్ణిమల మాట మాత్రమే 
ఇది చాలు చివరి సంతకం పెట్టగానే 
మన తలుపులు మనమే తెరవాలి

జీవన్మరణాలు నిరంతరం సాగే ప్రక్రియ 
జీవనం అటవికుల గుడారంలాంటిది 
ఇవ్వాళ్ళ యిక్కడ, రేపటి ప్రస్థానం ఎక్కడో 
ఎవడికి తెలుసు, రేపటి ఉషస్సు ఎక్కడో 
ఆకాశం ఆనంతం చీకటి రాత్రిలో 
ప్రాణాలు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది 
మనమనస్సును మనమే అడగాలి!

 

జలజం సత్యనారాయణ
2021-11-09 11:47:31


జలజం - ఒక జీవనది

సంగీతమైనా సాహిత్యమైనా

శాస్త్ర విజ్ఞానమైనా లోకజ్ఞానమైనా

నిరంతర కృషితో సాధ్యమయ్యే భగీరథ యత్నాలే

సులభ సాధ్యమయ్యే పనులేవీ

చరిత్రలో నమోదుకునోచుకోవు

అలుపెరుగని ఆరాటంలో 

ఆవిర్భవించే అత్యద్భుతాలే

ఒక జీవితకాలంలో సఫలీకృతమైన 

ఆవిష్కారాల పరంపరలే

బహుముఖీయ ప్రజ్ఞాపాటవాల

సృజనశీలత

కాలం కొలనులో విర బూసిన

మనోజ్ఞ మందారాలు

ఒక అవిశ్రాంత పథికుడి ఆలోచనల

తరంగాలే

అమృతం చిలికే భావుకత

మనోవీచీకలే

సాధన వేదనలో సుసాధ్యమయ్యే

సంరంభాలే

జీవన కడలిలో ఒప్పొంగిన 

అలల తాకిడి 

రాటుదేలి మేలిమి బంగారమైన

భావావేశాలు

పదాల కూర్పులో వెదజల్లిన

రసానుభూతులు 

సుదీర్ఘ మనో మధనంలో పారిన

 సాహితీ చెలిమెలు

విభిన్న సాహితీ ప్రక్రియల్లో

వినూత్న ఒరవడులు

కాల నాళికలో ప్రవహించే 

జీవన పార్శ్వాలు

ప్రపంచానికి పంచిన మేధో పరిమళాలు

అజ్ఞాన తిమిరల్ని హరించే 

దివ్య మూలికలు

వెరసి~

' జలజం ' ఒక ఎత్తైన శిఖరం

జీవన పోరాటంలో తపించి

తీరం చేరిన యోధుడు

అతడు -

కలకాలం కాలానికి ఎదురీదే ఒక జీవనది

జలజం కనరానిలోకాలపయనం

నాలోని అయోమయం స్మృతి పధం

 

కే.లక్ష్మణ్ గౌడ్
2021-11-09 11:18:53


సాహితీ వనంలో వికసించిన జలజం 

'మానవుడే మా సందేశం' అంటూ

సమాజ శ్రేయస్సే ధ్యేయమని నమ్మి 

ఆచరించిన మహర్షి 

అనుసృజనతో 'వేదన' 'శిఖరం' లను

అధిరోహించిన ఘనాపాటి 

సాహిత్యాన్ని సామన్యుడితో జోడించిన 

సమసమాజ నిర్మాణ యజ్ఞ 'అనలుడు'

చదువు సంస్కారంలకు సామాజిక సృహను 

మేళవించి బోధించిన ఆచార్యుడు 

శరీరం శిథిలం ఇది తథ్యం 

ఆత్మ నిత్యం ఇది సత్యం.  
 

రవీందర్ గోటూరు 
2021-11-09 11:11:45


మీ పవిత్రమైన ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాము

రాము
2021-11-07 19:49:24


Is Jalajam no more?
No! No! No !
He is evergreen writer and
Evergreen Palamur 
           Philosopher.
Jalajam.......
   Thou art workaholic 
           to have dareness.
Thy impeccable heart carves for  plamuru  
      Telugu mother ( Thalli).
Godess of Saraswati 
     Sheds her tears for 
    Orphans of telugu literature people of 
    Palampur.
We were happy previously, 
  So also learn to live 
        In his memory forever .
  Look ! His smiling face  
        from the sky looking at us pitifully leaving us in desperate 
Condition saying goodbye.

 

J.Sharanapp
2021-11-07 12:34:40


సాహితీవేత్త జలజం మృతికి నివాళి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్త, తెలంగాణ ఉద్యమ నాయకుడు జలజం సత్యనారాయణ (82) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకుడిగా పనిచేసిన ఆయనకు విద్యావేత్తగా పేరుంది. పలు హిందీ, ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయీ కవితలను తెలుగులోకి అనువదించి 'శిఖరం' పేరిట కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. జలజం మృతికి మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. ఎన్.గోపి, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి, వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు జలజం సత్య నారాయణ పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో నాయకులు, కవులు, రచయితలు ఒబేదుల్లా కొత్వాల్, కోట్ల వెంకటేశ్వర్రెడ్డి, కె.లక్ష్మణ్డ్, భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, ఎస్. విజయ్ కుమార్, నాయిని బాగన్నగౌడ్, వెంకటస్వామిగౌడ్, గుముదాల చక్రవర్తిగౌడ్, బాదేపల్లి వెంకటయ్య, గౌడ్, రావూరి వనజ, శాంతారెడ్డి, పులిజమున, పలు విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో జలజం చిత్ర పటానికి పలువురు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎన్. ప్రభాకర్, నాయకులు రాచందర్జీ, వెంకట్ రెడ్డి, మాధవి పాల్గొన్నారు.

 

ట్రస్మా నాయకులు, ఉపాధ్యాయులు
2021-11-07 12:30:11


శ్రీ జలజం

శ్రీ జలజం వాకింగ్ ఎన్ సైక్లోపీడియా 

కళ్ళముందు సాక్షాత్కరించిన జ్ఞానఖని.

విద్యా ప్రస్థానంలో ప్రభుత్వానికే దిశానిర్దేశం చేసే సమగ్ర విజ్ఞాన సర్వస్వం 

ఆంగ్ల మాధ్యమంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలకు ఆదిగురువు

విద్యాసంస్థల అధినేతలకు ఆయనొక తొలి పాఠం.

విశ్వవ్యాప్త విజ్ఞానఘనుల్ని ప్రంచానికందించి,

వెలుగురేఖల్ని ప్రసరించిన అరుదైన జ్ఞానసంపన్నుడు.

అవిశ్రాంతంగా అహోరాత్రం శ్రమించే అగ్నిహోత్రుడు.

సాహితీవనంలో విరబూసి, విశ్వవ్యాప్త సాహితీ సంద్రంలో ఓలలాడిననిత్య సత్యాన్వేషి.

అన్వేషణాపరుడు, అసమాన ఆలోచనాదురంధరుడు,

వినూత్నపోకడలకు అరుదైన సృజనశీలి,

ప్రాక్పశ్చిమ సిద్ధాంతాల సారాన్ని అధ్యయన

తపస్సులో పరవశించిన నిరంతర శోధకుడు.

రాజకీయంలో రాణించలేని వైఫల్యం విద్వత్తు

విజ్ఞత కరువైన ఎడారిలో అలసిసొలసి

విశ్రమించిన నిర్వేద మానస కల్లోలం. 

మత మౌఢ్యం ముసుగులో అర్భకుల అరాచకాలకు ఆమడదూరం.

బహుభాషా నైపుణ్యంతో ఆవిష్కరించిన

అత్యద్భుత సాహితీ సంరంభాలు.

జనసమూహాల సాంగత్యంలో జీవనసాఫల్యం

అనుభవించే నిష్కామకాముకుడు.

జ్వాజల్య మానంగా వెలిగే జీవితేచ్ఛ

వృద్ధాప్య ఛాయల్ని

దరిజేరనివ్వని నిత్యక్రియాశీలుడు

గరళకంఠుడు హరించే హాలహలం

విమర్శల సుడిగుండాల్లో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం.

బడుగు బలహీన జనాభ్యుదయమాకాక్షించే సమాజ హితైషి

స్వయం ప్రబోధిత ఉద్వేగంలో భాషాయుధాన్ని

సంధించి-బిల్హణీయం- తెలుగు సాహితీ 

పిపాసులకు అందించిన ఓదివ్య అనుభూతి.

శ్రీ జలజం గారికి నివాళులర్పిస్తూ..

లుంబిని కుటుంబం 
 

కే. లక్ష్మణ్ గౌడ్, జి.సంయుక్త రాయ్
2021-11-07 11:37:30


మూడు తరాల సాహితీ వృక్షం

జలజం అంటే తెలుగు సాహిత్యం జలజలా ప్రవహిస్తుంది. జలజం అంటే శ్రీశ్రీ, కాళోజీ, దాశరథితో కలిసి పనిచేసిన ఆనాటి యువకవి. జలజం అంటే నిత్యకదలికలున్న నిండైన సాహితీవేత్త. జలజంకు వయసుతో సంబంధం లేదు.. 1950ల నాటి తరంతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఇప్పటి అత్యాధునిక కవులతో కలిసి అడుగులు వేయటం ఆయన చలనశీలతకు నిదర్శనం. జలజం తొలిదశ తెలంగాణ ఉద్యమం చూసినవాడు. మలిదశ ఉద్య మంలోని కవులతో కలిసి అడుగులు వేసిన పెద్ద మనిషి. పెద్ద మనసున్న మనిషి జలజం తెలంగాణ మట్టినుంచి ఎగిసిపడ్డ మండేకవి. జలజం విలువైన ఇతర భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించిన కవి.

జలజం... మట్టిస్పృహా ఉన్నవాడు. మానవీయ సోయి ఉన్నవాడు. నిండారైన మంచి మనసున్న మనిషి, జలజం కాలంతో కరచాలనం చేసి భావ జాలంతో కలం చేతబట్టి యుద్ధం చేసిన వాడు. జలజం మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాతో ఈ తరంతో కలిసి పనిచేసిన వ్యక్తి. 2002లో నేను 'పొక్కిలి మలిదశ తెలంగాణ ఉద్యమ కవిత్వం తొలి సంకలనం చేతబట్టి తిరుగుతుంటే ఈ క్రమంలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో కలిసి మహాబూబ్ నగర్ రావటంతో మా తొలి పరిచయం మొదలయ్యింది.

అప్పటి నుంచి ఆయన కన్ను మూసేవరకు ఆ పరిచయం ఉద్యమ పరిచయంగా, తెలంగాణ సాహిత్య ఉద్యమ పరిచ యంగా బలపడింది. డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసిన జలజం సత్య నారాయణకు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వం ఉంది. శ్రీశ్రీ ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడన్న సందర్భంలో తాను కూడా సాయం చేశానని మాకు చెప్పారు.. ఆయన ఉపాద్యాయవృత్తి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత మహాబూబ్ నగర్ లో జలజం విద్యా సంస్థలు పెట్టి జిల్లాలోనే భారీ విద్యా వ్యవస్థను నెల కొల్పారు.

తెలంగాణ రచయితల వేదికకు మహబూబ్ నగర్లో కొండంత అండగా నిలిచింది ఆయనే. మలిదశ ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు ఆయన సాహిత్య జెండా పట్టుకుని ఉద్యమ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసినారు. ఆయన ఒక్క రాత పనికే పరిమితం కాలేదు. జిల్లాలో కవులను కది లించటంలో, సమావేశాల నిర్వహణ చేపట్టటం, ఆర్థికంగా తానే ముందుండి సొగటం వరకు ఆయన కృషి మరువలేనిది. ఆయన ఇంట ఆతిథ్యం తీసుకోని రచయితలు లేరనుకుంటా!! తన వయసును మరిచి కొత్తతరం కవులతో కలిసి అడుగులు వేశాడు. 1950లో "మానవుడే మా సందేశం" అనే కవితా సంపుటికి జలజం సంపాదకత్వం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ధ్వని సంచికలు వెలువరించారు. ఆయన రచనలు శ్రామికవర్గ పక్షపాతిగా ఉంటాయి. ఆయన చేసిన అనువాద కవిత్వం ఆశ్చర్యం గొలుపుతుంది. మాజీ ప్రధాని వాజ్పేయ్ రాసిన కవిత్వాన్ని తెలుగులో ""శిఖరం" పేరున అనువదించారు. ఆ కవిత్వం చదువుతుంటే వాజ్పేయ్ స్వయంగా తెలుగులో రాసినట్లుంటుంది.

ఆయన అనల, శిఖరం, ఆంసు, కబీరు, హాఫిజ్ కవిత్వం, వేదన బలణీయం గ్రంథాలను తెలుగులో రచించారు. కబీర్ గీత, ఫైజ్ హామ్మద్ ఫైజ్ వంటి అద్భుత గ్రంథాలు తెలుగు సమాజానికి అందించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు పుస్తక ప్రదర్శనకు అండదండగా నిలిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక కవిసమ్మేళనాలు, సభలు, సమావేశాలు నిర్వహించి భావజాల వ్యాప్తి చేశారు. జలజంలో సాహిత్యం తో పాటు సామాజిక చింతన కూడా బలంగా ఉంది. గత కొన్ని నెలలుగా అమెరికాలో తన బిడ్డవద్ద ఉంటూ చాలా పెద్ద ఎత్తున అనువాదం రచనలు చేశారు. అవన్నీ అముద్రితంగానే ఉన్నాయి.

వాటిని వెలుగులోకి తేవలసిన పని మిగిలి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జలజం సాహిత్య రథానికి ముందు వెనుక అనేక మంది కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ లక్ష్మణ్ గౌడ్ వంటి సాహిత్య సైన్యం ఉంది. నిత్య కవిత్వ సాహిత్య సారస్వత వెలుగులు విరజిమ్మే జలజం సత్యనారాయణ కన్ను మూయటం దీపావళి రోజున దీపమారినట్లుగా ఉంది. ఆయన రచనలు మాత్రం నిత్యం వెలుగొందుతూనే ఉంటా యి. ఆయన మరణానికి దగ్గరవుతున్నాడని అమెరికాలో వైద్యులు చెప్పినప్పటికీ ధారా వాహికంగా భారీగా ఆయన అనువాద రచనను. కొనసాగించారు. చివరకు మరణం దగ్గరవుతుందని తెలిసి తన బిడ్డ దగ్గరున్న జలజం మహాబూబ్ సగర్ మట్టిని ముద్దాడేందుకే వచ్చి చివరి శ్వాసను విడిచారు. జలజం అంటే మూడు తరాల తెలుగు సాహిత్య మహావృక్షం.

 

 

జూలూరు గౌరీశంకర్
2021-11-07 11:09:47


Oum..Peace
The late Jalajam Satyanarayana was a leader of backward classes, a retired professor, translator, writer, eminent poet, a renowned hero of the state of Telangana, the head of a private school, and a social worker and loyalist.  His desperate deficit for the people of Telangana state.  His contribution to literary service in particular was great.  Poets and artists are encouraged to lead many activities in the Palamuru district.  I sincerely hope that the people of Palamuru will always remember the services rendered by the physically distant Jalajam and bring peace to his Holy Spirit.

 

(Ravi Chanchala, President, Palamuru Kavana Vedika, Telangana)

Ravi Chanchala
2021-11-07 09:44:40


మన ప్రైవేట్ పాఠశాల గౌరవ రాష్ట్ర సలహాదారు జలజం సత్యనారాయణ సార్ గారు మరణ వార్త వినగానే మన ప్రైవేట్ పాఠశాల ఆశాజ్యోతి ఇక లేరు అనే వార్త ఎంతో మంది యాజమాన్యాలకు బాధాకరంగా ఉంది. అతడు మన ప్రైవేట్ పాఠశాల గురించి సమస్యల పైన పోరాటం చేసిన ధీశాలి. వారుప్రభుత్వ జీవోలు ఎన్ని వచ్చినా వాటిని పరిష్కరించి మన ప్రైవేట్ పాఠశాలలో ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అతడు ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లను ఇంజనీర్లను ఎంతో మందిని తయారుచేసిన గొప్ప వ్యక్తి. బీదవారికి ఫీజు లేకుండాఫ్రీగా చదివించిన గొప్ప ఉదార స్వభావం గలవాడు మననిజం సార్మంచి కవిగా అదేవిధంగా ఎంతో మందికి రాజకీయ గురువుగా ఎదిగిన గొప్ప వ్యక్తి మన పాలమూరు ముద్దు బిడ్డ జలజం సార్.


2021-11-06 19:26:00


Very sad to hear the demise of Sri. Jalajam Satyanarayana.
A great educationist, socialist and humanitarian.
We pray for the comfort of the bereaved family, near and dear.
May God give them peace.


2021-11-06 19:23:10


Very sad to hear the news of demise of Sri.Jalajamgaru.A renowned reformist and writer,author of many books from Mahaboob Nagar. During our college days he was a recognized revolutionary against social evils. A legendary in establishing excellent education system in Mahabubnagar. Personally I know sir as educationist, good guide and philospher. It is real loss to the people of Mahaboob Nagar.
His soul may rest in peace.


2021-11-06 19:21:27


కవిదివిసీమకెళ్ళినజలజం...!

చీకట్లు తొలిగి వెలుగులు
మెరిసె దివ్య దీపావళీ రోజు
సూర్యుడు పశ్చిమానికి
వెళ్ళాడేమో...
సాహిత్య జలజాకరం లోని
సుప్రసిద్ధ "జలజం" వాడిపోయింది!
మాటల్లో మృదుత్వం
సాహిత్యప్రసంగాల్లో
అనర్ఘళఉపన్యాస
విన్యాససరళత..!
అనువాదరచనల్లో
మేరునగధీరత్వం..!
మహాకవిగా నిరాడంబరత
సద్వివిమర్శకులుగా
సంభాషణచతురత
జలజంగారిప్రత్యేకత!
చక్కనివ్యక్తిత్వవికాససరళి
చిరుపెదాలుచిందించేనవ్వు
యువనవకవుల్లోఉత్తేజం..!
సహకవులతోసన్నిహితవరి!
ఎంతబాధపడ్డతిరిగిరాని
లోకాలకెళ్ళిన,వారిరచనలు
"నభూతోనభవిష్యతి...!"
చీకట్లో వెలుగులీను సుకవి
సాహిత్య లోకంలో మనకు
అనువాద కవితా దీపాలందించి
అమరుడైన
నిండుమనసున్న
జలజంగారిని
మనంమళ్ళీ
చూడగలమా!
వారి రచనల్లో తప్ప!!!

డా.గన్నోజుశ్రీనివాసాచారి
        (8555899493)
        (మహబూబ్ నగర్)

డా.గన్నోజుశ్రీనివాసాచారి
2021-11-06 17:43:04


ప్రముఖ అనువాద కవి, విశ్రాంత ఉపన్యాసకులు, కాళోజీ హాల్ నిర్మాత, లిటిల్ స్కాలర్ స్కూల్ అధినేత , మా సంస్థ సలహాదారు, నన్నెంతో ప్రోత్సహిస్తూ నా రచనలను పాలమూరు లోనూ, మా అమ్మగారి ఊరు దాసుపల్లిలోను (మౌన గీతం, అమ్మా నాన్న ద్విశతిని) ఆవిష్కరణ చేసిన  మంచి మనిషి జలజం సత్యనారాయణ గారిని కోల్పోవడం పాలమూరు మరియు యావత్ తెలంగాణ సాహిత్య లోకానికె తీరని లోటు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ... వారి కుటుంబ సభ్యులకు  అరుంధతీ రాయ్, సంయుక్త లక్ష్మణ్ గౌడ్ , మంగ రాయ్, గాయిత్రి మరియు ఇతర సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..

శ్రద్ధాంజలి ఘటిస్తూ...
శ్రీమతి. శాంతారెడ్డి.
తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ, మహబూబ్ నగర్

శ్రీమతి. శాంతారెడ్డి.
2021-11-06 17:41:23


It is saddend to hear that prominent translator, poet and retired lecturer's demise is a great lose to the literary world.
My deep condolences to his family members and let his literary encouragement be ever stayed in the palamur literary annals.
He had unveiled my book-let " The Life"  at Lubini school.
He was peaceful minded person.
 

J. Sharanappa
2021-11-06 17:37:47


పాలమూరు సాహితీవేత్త  "జలజం"
         (సంస్మరణ)

పాలమూరు గడ్డ మీద పుట్టిన అరుదైన వ్యక్తి జలజం సత్యనారాయణ. పాఠశాల ఉపాధ్యాయునిగా మొదలైన బోధన జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా సాగింది. ఒక వైపు పాఠాలు బోధిస్తూ క్రమంగా సామాజిక వేత్తగా, సాహితీ వేత్తగా ఎదిగారు. రాజనీతి శాస్త్రాన్ని బోధిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకునేవారు. మర్రి చెన్నారెడ్డి మొదలుకొని కేసీఆర్ దాకా ఎందరితోనో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేవారు. బహుజన పక్షపాతిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. గత అర్ధ శతాబ్ధం పైగా లిటిల్ స్కాలర్ వంటి విద్యా సంస్థను నిర్వహిస్తూ వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు ఉత్తమ విద్యను అందించారు.

మరో వైపు అభ్యుదయ, ప్రగతి శీల భావాలతో కవిత్వ రచన చేశారు. అనల వారి మొదటి కవితా సంకలనం. 'మానవుడే మా సందేశం' కవితా సంపుటికి సంపాదకునిగా వ్వవహరించారు. విప్లవ కవి వరవరరావుతో కలిసి పనిచేశారు. తదనంతర కాలంలో తెలంగాణ సాహిత్య చరిత్రలో ఎవరూ చేయనంతగా ఇటీవల అనువాద కవిత్వాన్ని వెలువరించారు. మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయ్ ఎంపిక చేసిన కవితలను 'శిఖరం' కవితా సంపుటిగా ప్రకటించారు. కబీరు కవిత్వాన్ని కబీరు గీతగా అనుసృజన చేశారు.ఇంకా ఆంశును వేదనగా, అనువదించారు. బిల్హణీయాన్ని తెలుగు చేశారు. ఫైజ్ కవిత్వాన్ని అనువదించి మనకందించారు. ధ్వని సాహితీ సంస్థను స్థాపించి, వందలాది సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. సాహిత్య సభల నిర్వహణ కోసం కాళోజి హాలు నిర్మించి కవులకు ఉచిత సౌకర్యం కల్పించారు.

ఎనిమిది దశాబ్దాల జీవిత కాలంలో అన్ని సామాజిక, అస్తిత్వ ఉద్యమాలల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రేరణ కలిగించిన ఉద్యమకారుడు. కాళోజి, దాశరథి వంటి కవులతో సన్నిహితంగా మెలిగి ఎంతో మంది కవులకు దిశా నిర్దేశం చేసిన క్రాంత దర్శి. జిల్లా సాహిత్య, సామాజిక  రంగాలపై తనదైన ముద్ర వేసిన జలజం వారు దీపావళి రోజే కన్నుమూయడం సాహిత్య లోకానికి తీరని లోటు. కారణ జన్ములు కార్యం నెరవేరిన వెంటనే నిష్క్రమించినట్లు వీరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తెలుగు సాహితీ లోకం ఒక పెద్దాయనను కోల్పోయింది. వారికి సాహితీ లోకం నివాళి అర్పిస్తున్నది.
                           

కోట్ల వెంకటేశ్వర రెడ్డి
2021-11-06 17:35:06


కన్నీటితో జ్యోహారులు అర్పిస్తున్నాము అందుకోండి జలజం సార్

సాధు శీలి యైన సాహిత్య కవిరాజు
మంచి పెంచి పంచి మాన్యుడయ్యి
సత్యమై జలజము సత్యనారాయణ
అమరుడయ్యి నిలిచె అవనియందు

 

ఆర్ చెన్నయ్య మరియు లుంబిని కుటుంబము
2021-11-06 17:30:18


వాడిన జలజం
   
దీపావళి నాడు
చీకటి లాంటి వార్త!
జలజం ఇక లేడూ అంటే
మానస సరోవరం చిన్నబోయింది.

పొద్దున చినుకులు పడుతుంటే
ఏమిటో అనుకున్నాను
కారణం తెలియని దుఃఖంలా
తెల్లారిందివాళ.

అనగనగా ఒక జలజం సత్యనారాయణ
పదేళ్లుగా అతని పేరే నిత్య ధారణ
బుద్ధి పుట్టగానే నూరు మైళ్లను
పక్కింటికి వెళ్లినంత అలవోకగా సంచారణ.
పాలమూరు భాగ్యనగరాల మధ్య
ఆసు పోసే సాహితీ వాహన
స్నేహమంటే అతనిదే
భావుకత అతని వొడువని కథ.

స్కూలు పెట్టి
పేద పిల్లలకు
ఆయన అందించిన విద్య
ఫ్యూడల్ సంస్కృతి పట్ల
ఆయన ధిక్కారం.

ఆయన జీవితం తిరిగిన మెలికలు
మసక బారని వ్యక్తిత్వం తళుకులు
ఎనిమిది పదులు దాటిన వయస్సులో కూడా
యువకులను దాటి పోయే చురుకైన నడకలు.

‘మానవుడే మా సందేశం’ నాటి సీనియర్ కవి
కరుణను ప్రకాశంగా వెదజల్లిన సాహితీ రవి
‘అనల’తో మొదలైన ఆయన కవిత్వం
జ్వలన గుణాన్ని కోల్పోలేదు.
అనువాద మహాయజ్ఞంలో
ఆయన ఆహుతిచ్చిన సమిధలు అనర్ఘం.

తన తర్జుమాతో
కబీరును
తెలుగువాడిగా మార్చేసిన సృష్టికర్త
వాజ్‌పాయ్ కవిత్వ శిఖరాన్ని
బెత్తలతో కొలిచిన ధీశాలి.
అతని పునః సృజనను చూస్తే
ఫైజ్ ఎంత ముచ్చట పడే వాడో
ముదిమి వయః పరిపాకంతో
వేలాది పేజీల జ్ఞానాన్ని దున్ని పారేసిన కృషీవలుడు.

ప్రొఫెసర్ కాదు
పీహెచ్.డీల కోసం కాదు
ప్రమోషన్ల ప్రసక్తి లేదు
జ్ఞానతృష్ణను
ఉష్ణ రుధిర ప్రసారంగా మార్చుకున్న ఘన పిపాసి.

నేను చైనాకు వెళ్లినప్పుడు
ఎయిర్‌పోర్టులో
తానే వెళ్తున్నంత హడావిడి చేశాడు.
మా యింటికి రాగానే
మేడ మెట్లను
పాదాలతో నిమురుతూ పలకరించే వాడు.

నా మిత్రుడు
అక్షర బాంధవుడు
పరిపూర్ణ పథికుడు
అత డివాళ లేడంటే
పాలమూరి ఆకాశం మరింత శూన్య మయ్యింది.
అతనికి
నా కన్నీటి నివాళి.

4 నవంబర్ 2021
[ప్రముఖ కవి, అనువాదకుడు, విద్యావేత్త జలజం సత్యనారాయణ గారి అస్తమయానికి పరితపిస్తూ]

డా౹౹ ఎన్. గోపి
2021-11-06 17:28:50


మా జలజము యిక లేరని
మా జలజము జ్ఞాపకాలు
మదిలో నిండెన్
మాజలజము సాహిత్యము
రాజిల వెలుగొందు చుండు
రవికాంతులతో..

మామదిలో నీ మాటలు
మామది లో నీదు కావ్య
మాధుర్యంబుల్
మామది లో నీ  రూపము
మామదిలో జలజ మన్న
మరువక నిలిచెన్.

నీ భావన అభ్యుదయము
శోభా యము అక్షరాల
సుశ్లోకంబై
నీ భాస్కర కిరణంబులు 
రే బవలును వెలుగు చుండు
రమ్యా కృతుల న్

కూలెను విద్యా శిఖరము 
వాలెను జలజంబు నేడు వాపోవంగన్ 
తేలెను నింగిని తారగ 
రాలగ కన్నీళ్లు నేడు రాజిత కీర్తిన్. 

నడిచే  విజ్ఞాన  ఖనిగ
సడిచే యక వెళ్లి నావు
సాహితి  చంద్రా
వడిగా సుర సభ గెలువగ
విడిచితివా జలజ మమ్ము
విజయము నందన్.

 

డా: కే బాలస్వామి 
2021-11-06 17:24:02


ఉద్యమ నాయకుడా అందుకో
 మా అక్షర నివాళులు

 పాలమూరు ముద్దుబిడ్డ
 తెలుగు సాహితీ ప్రియుడా
 జంగయ్యగౌడ్ కృష్ణవేణిల
 వంశోద్ధారకుడా
 నీవు లేవనే మరణవార్తతో
 మా గుండెలు అదిరిపోయే
 ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టి
 అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అంచెలంచెలుగా ఎదిగినావు
 పాఠశాల లెన్నో నెలకొల్పావు
 పేద విద్యార్ధులకు పాఠాలు చెప్పించావు
 ఓ సరస్వతి ప్రియ పుత్రుడా
 నిన్ను మరిచి మేము ఉండలేము
 ఎన్నో పుస్తకాలను రాశావు
 పరభాషల సాహిత్యాన్ని
 తెలుగులోకి అనువదించి
 భాషాభిమానం చాటుకున్నావు
 పుస్తకాలలోని అక్షరాలలో నన్ను చూసుకోమని
 కానరాని లోకాలకు పయనమైనవు
 తెలుగు సాహిత్యానికి నిరుపేదల విద్యాభివృద్ధికి
 నీవు చేసిన కృషి మరువలేనిది
 ఓ సరస్వతీ పుత్రుడా
 ఓ ఉద్యమ సూర్యుడా
 అందుకో మా అక్షర నివాళులు
 అందుకో మా కన్నీటి జోహార్లు

శోకతప్త హృదయాలతో నీకు కన్నీటి వీడ్కోలు
           మీ
మన్నె బస్వరాజ యాదవ్
కొడంగల్ తాలూకా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

మన్నె బస్వరాజ యాదవ్
2021-11-06 15:51:38