మున్సిపల్‌ చైర్‌పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్‌లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్‌ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు.

అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన పుట్ట శైలజ తన ఫోన్‌ ను శ్రీనుకు ఇచ్చినట్లు బందోబస్తుకు వచ్చిన రామగుండం ఆర్‌ఎస్సై అజ్మీరా ప్రవీణ్‌ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్‌ ఇచ్చి మాట్లాడించారని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సైతం పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

మునుపటి వ్యాసం