నకిలీ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి డబ్బులు స్వాహా

నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొందరు ఆసరగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు

మహబూబాబాద్‌: నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొందరు ఆసరగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. పథకం ప్రారంభం కాక ముందు జరిగిన వివాహాలు ఇటీవలే జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన నలుగురు మహిళలకు కొన్నేళ్ల క్రితమే వివాహాలు జరిగాయి. అయితే, తాజాగా వారి పేరున కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నలుగురికి సంబంధించిన చెక్కులను నిలిపివేశామని తహసీల్దార్‌ నాగభవాని మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.