ఏసీబీకి పట్టుబడిన ఎంపీడీవో

కరోనా వైరస్ ప్రభావంతో ఓ వైపు వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే మరో వైపు అక్రమ సంపాదనను వెనకేసుకునేందుకు చూస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వైరస్ ప్రభావంతో ఓ వైపు వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే మరో వైపు అక్రమ సంపాదనను వెనకేసుకునేందుకు చూస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఆడేపు రామలింగయ్య అనే కాంట్రాక్టర్ స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పనులు చేస్తున్నాడు. కాగా, చెక్‌పై సంతకం పెట్టేందుకు ఎంపీడీవో ఆల్బర్ట్ రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రూ.20వేలు ఎంపీడీవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన ఏసీబీ అధికారి మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.