అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం-తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

నాలాలపై ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామని వెల్లడి

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈమేరకు త్వరలో నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. శుక్రవారం వర్షాకాల కాల ప్రణాళిక పై జీహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఈసారి అలా కాకుండా నాలాల పూడిక తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. నాలాలపై ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లనుకేటాయిస్తామని తర్వాత ఇక్కడి నుంచి వారిని తరలిస్తామన్నారు. నగరంలో 1,368 కి.మీ. మేరకు నాలాల అభివృద్ధి జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌అలీ, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.