తెలంగాణను బాల్య వివాహాల లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సత్యవతి

పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లాలో అమలు

వరంగల్‌: విద్యా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక సమాజంలో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండడం దురదృష్టకరమని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ నుంచి వెబినార్ సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా గిరిజనులు, పేదవాళ్లు ఉన్న ప్రాంతం. ఆడపిల్ల ఇంట్లో ఉంటే భద్రత, పోషణ విషయంలో పేదలకు అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆలస్యమయ్యే కొద్ది సరైన సంబంధం దొరకకపోవచ్చనే భయం ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్‌ 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయికి పెండ్లి చేయడాన్ని ప్రోత్సహించే విధంగా వారి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసే కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

బాల్య వివాహాలను మొదటి స్థాయిలోనే నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. బాల్యవివాహాలు నేరమనే అవగాహన విస్తృతంగా కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మతపెద్దలకు ఈ బాల్యవివాహాలు నేరమనే చైతన్యం కల్పించాలన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో బాల్యవివాహాలపై పోస్టర్లు వేయాలి.

బాల్యవివాహంలో ఆడపిల్ల తల్లిదండ్రుల మీద కంటే అబ్బాయి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మైనర్ అమ్మాయిని పెండ్లి చేసుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని, జీవితం ఇబ్బందుల పాలు అవుతుందని అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీ.పీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు నాగరాణి, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుదర్శన్, ఇతర అధికారులతో మంత్రి ఈ విషయాలపై చర్చించి పలు సూచనలు చేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox