త్వరలోనే పోలీసు నియామకాల భ‌ర్తీ: హోంమంత్రి

పోలీసు శాఖకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత

సంగారెడ్డి: త్వ‌ర‌లోనే 20 వేల పోలీసు నియామకాల‌ను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్య‌యంతో నిర్మించిన‌ సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని శ‌నివారం ఆయన ప్రారంభించారు. అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వివిధ విభాగాలలో ఇప్ప‌టివ‌ర‌కు 80 వేల మందికి పైగా వివిధ శాఖల్లో నియమించినట్లు ఆయన చెప్పారు. 

పోలీసుశాఖ‌కు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు మ‌హ‌మూద్ అలీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళా ప్రాధాన్య‌త‌లో భాగంగా నియామ‌కాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన‌ట్లు తెలిపారు. మహిళలకు రక్షణ నిమిత్తం షీ టీమ్స్ ఏర్పాటును ఆయ‌న ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్‌ను రిసెప్షనిస్ట్‌గా నియమించడం ద్వారా సామాన్య ప్రజలు ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్‌కి వ‌స్తున్నార‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భ ప్రొటెం ఛైర్మ‌న్ వీ. భూపాల్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ (వెస్ట్ జోన్) స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ నిజామాబాద్ రేంజ్ శివశంకర్ రెడ్డి, పోలీసు సూపరింటెండెంట్ ఎస్ చంద్రశేకర్ రెడ్డి, అదనపు ఎస్పీ కే. శ్రుజన, అదనపు కలెక్టర్ జే. వీరా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మునుపటి వ్యాసం