నేడు అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం

కొవిషీల్డ్ టీకా వేయించుకున్న వారు 70 రోజుల వరకు, కోవాగ్జిన్ తీసుకున్న వారు కనీసం 56 రోజుల వరకు రక్తదాతలుగా మారకూడదు.

ప్రపంచ వ్యాప్తంగా రక్తం యొక్క విలువను తెలియజేసేందుకు, రక్తాన్ని దానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించేందుకు, రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ ఓ) 2005 నుంచి జూన్ 14 న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నోబెల్‌ అవార్డు గ్రహిత కార్ల్‌లాండ్‌ స్టీనర్‌మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. ‘ఏ’, ‘ఓ’, ‘బీ’, బ్లడ్ గ్రూపులను కనుగొన్న‌కార్ల్ లాండ్‌ స్టీనర్‌ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు.

రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేని కారణంగా వేరొకరు తమ రక్తాన్ని దానం చేస్తే మరొకరి ప్రాణాలను కాపాడొచ్చు. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో, విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తాన్ని మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. ఇలా రక్తదానం చేయడం కేవలం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. 

కరోనా విపత్కర పరిస్థితుల్లో తగ్గిన రక్తం నిల్వలు:
దేశ జనాభాలో కేవలం ఒక శాతం జనాభా మాత్రమే రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్త దాతలుగా మారేందుకు అసక్తి సన్నగిల్లినట్లు తెలుస్తోంది. వీటికి తోడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం మూలంగా రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది.  దాతల నుంచి రక్తాన్ని స్వీకరించినా కొవిడ్ సంక్రమించదన్న విషయాన్ని జాతీయ రక్త మార్పిడి మండలి వెల్లడిస్తోంది. 

కరోనా నేపథ్యంలో ఎవరెవరు రక్త దానం చేయవచ్చు?

  • రక్తదానం కారణంగా లేదా రక్తం స్వీకరణ కారణంగా కరోనా మహమ్మారి సోకడం చాలా అరుదనే  విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  కొన్ని విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. అవి
  • రక్త దానానికి ముందు కరోనా నిర్దారణ పరీక్ష తప్పనిసరి కాదు. (రక్తం ద్వారా కరోనా రావటం చాలా అరుదు)
  • కరోనా మహమ్మారి నుంచి కోలుకుని లేదా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న 28 రోజుల అనంతరం రక్తాన్ని దానం చేయవచ్చు. 
  • ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వారు సైతం 28 రోజుల తర్వాత రక్త దాతలుగా మారవచ్చు. 
  • రక్త దాతలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షిత రక్తదానానికి పూనుకోవాలి.
  • ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడి కోలుకున్న 28 రోజుల తర్వాత రక్తదానానికి సిద్ధం కావచ్చు. 
  • టీకా తీసుకున్న వారి విషయానికి వస్తే.. కొవిషీల్డ్ టీకా వేయించుకున్న వారు 70 రోజుల వరకు, కోవాగ్జిన్ తీసుకున్న వారు కనీసం 56 రోజుల వరకు రక్తదాతలుగా మారకూడదు. అలా కానీ పక్షంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. 
  • రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox