టీటా ఆధ్వర్యంలో బ‌ల్మూరులో కొవిడ్ ద‌వాఖాన‌

తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్, ఏటీఎస్‌ ఆధ్వర్యంలో రెండో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటు

నాగర్ కర్నూలు, బల్మూర్‌: క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న చికిత్స స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకు అమెరిక‌న్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్‌), తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా కొవిడ్ దవాఖాన ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతోంది. ఈ మేర‌కు నారాయ‌ణ్‌పేట్ జిల్లా మాగ‌నూర్ లో తొలి దవాఖాన గత నెలలో  ప్రారంభించింది. ఈ దవాఖాన‌కు కొన‌సాగింపుగా ఆదివారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బ‌ల్మూరులో తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా టీ.క‌న్స‌ల్ట్ ద్వారా మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి తొలి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ పీ.రాములు, స్థానిక‌ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు  గౌర‌వ అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక గ్రామ ప్ర‌జ‌లు అమెరికాలో ఉన్న‌ వైద్యుల‌తో అనుసంధానం అయ్యారు.

కొవిడ్ దవాఖాన ప్రారంభించిన సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ..హెల్త్ కేర్ లో టెక్నాల‌జీ ఎలా వినియోగించ‌వ‌చ్చ‌న్న‌ది టీటా నిరూపిస్తోందని ఆయన ప్ర‌శంసించారు. ఉన్న‌త విద్యావంతులైన టెక్కీలు టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్  మ‌క్తాల ఆధ్వ‌ర్యంలో ప‌ల్లెసీమ‌ల్లో సేవ చేసేందుకు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సందీప్ మ‌ఖ్తాల‌తో దాదాపు ప‌దేళ్లుగా ఉన్న ప‌రిచ‌యంలో ఆయ‌న సామాజిక స్పృహ‌, గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌ప‌న స్ప‌ష్టంగా గ‌మ‌నించామ‌ని మంత్రి పేర్కొన్నారు. బల్మూర్ మండ‌ల వాసులు కొవిడ్ దవాఖాన‌ సేవ‌లు వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు.

ఎంపీ పీ రాములు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు త‌మ ప్రాంత వాసుల‌ ఆరోగ్యంపై శ్రద్ధ చూప‌డం సంతోష‌క‌రంగా ఉంద‌న్నారు. ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు మాట్లాడుతూ.. బ‌ల్మూర్‌లో కొవిడ్ దవాఖాన ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన టీటాను అభినందించారు. ఈ దవాఖాన ఏర్పాటుతో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య సేవ‌లు మ‌రింత చేరువ అవుతాయ‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెండ్ సందీప్ మ‌క్తాల మాట్లాడుతూ..మ‌రిన్ని కొవిడ్ దవాఖాన‌లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

బ‌ల్మూర్‌ ఎంపీపీ అరుణ‌, గ్రామ స‌ర్పంచ్ శివ‌శంకర్‌, ఏటీఎస్ ఇండియా అడ్వైజ‌ర్‌ బాణాపురం రామచంద్ర రెడ్డి, మాధ‌వ‌రం రాఘ‌వరావు, శ్రావ‌ణి బాస‌రాజు, ఇలియాస్ , సౌమ్య , పూజ బండారి, అనీష్ స‌ర్వ‌బోట్ల‌, జ్ఞాన‌క‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు. అమెరిక‌న్ తెలంగాణ సంఘం త‌ర‌ఫున ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ నరేందర్ చీమెర్ల, కొవిడ్ దవాఖాన ప్రోగ్రాం అడ్వైజర్ డాక్టర్ దిలీప్ బీరెల్లి, తాజా మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల జనరల్ సెక్రటరీ  వెంకట్ మంతెన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మునుపటి వ్యాసం