తిరుమ‌ల‌లో మూడురోజుల‌పాటు జ్యేష్ఠాభిషేకం

ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో కార్యక్రమ నిర్వాహణ

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నెల 22 నుంచి 24 వర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా మొదటిరోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంత‌రం వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు. రెండోరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజైన 24న తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ఈనెల 24న వర్చువల్‌ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను దేవస్థానం రద్దు చేసింది.