వరంగల్ లో 24 అంతస్తులతో భారీ దవాఖాన

ఈ నెల 21న దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్

వరంగల్ అర్బన్: జిల్లాలోని పాత కేంద్ర కారాగారం ఉన్న స్థలంలో నిర్మించతలపెట్టిన  దవాఖాన నిర్మాణానికి ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అదేరోజు వరంగల్‌ కలెక్టరేట్‌ భవనాన్నికూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ...వరంగల్‌ ఆసుపత్రిని 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాంకేతిక హంగులతో గ్రీన్‌బిల్డింగ్‌గా తీర్చిదిద్దుతామని, మెరుగైన సౌకర్యాలతో దేశంలోనే అద్భుతమైన మల్టీలెవల్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానగా నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

అత్యవసర చికిత్సకు వచ్చే బాధితుల కోసం దవాఖాన భవనంపై హెలికాప్టర్‌ దిగేలా హెలీపాడ్‌ను కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు. కెనడాలోని దవాఖానల తరహాలో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్‌ వెంటిలేషన్‌ పద్ధతుల్లో నిర్మాణం ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం కెనడా పర్యటించి రావాలని సూచించారు. ఇటీవలే 7 మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలను మంజూరు చేసినట్టు వివరించారు.

దాంతో పాటు జిల్లాలో ప్రతిసారి సీజన్‌ ప్రారంభానికి ముందే వైద్యశాఖ అధికారులు అటు పంచాయితీరాజ్‌, ఇటు మున్సిపల్‌శాఖ అధికారులతో చర్చించి వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  సూచించారు. ఈ విధానాన్ని ఒకపని సంస్కృతిగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం విషయంలో అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సూచించారు. బస్తీ దవాఖానలు బాగా పనిచేస్తున్నాయని అభినందించారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 29 నుంచి 55 శాతానికి పెరిగాయని కేసీఆర్ అన్నారు. 

మునుపటి వ్యాసం