కరోనాను ఎదుర్కోవడంలో గ్రామ సచివాలయాలు సమర్థంగా పనిచేశాయి: జగన్

కొవిడ్‌కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనేనన్న సీఎం

అమరావతి: కరోనాను అడ్డుకోవడంలో గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ జ్వర సర్వే చేశామని, కొవిడ్‌కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనేనని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌లు ఇవ్వలేకపోతున్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు జూన్‌లో 17,71,580 డోసులు కేటాయిస్తే.. కేవలం 4,20,209 డోసులు మాత్రమే వినియోగించారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని స్టాక్‌ను రాష్ట్రానికి కేటాయించాలని జగన్ కోరారు. అంతే కాకుండా అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. విభజనతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని పేర్కొన్నారు.