ఏపీ నామినేటెడ్ పోస్టుల ప్రకటన చేసిన జగన్

నామినేటెడ్ పోస్టుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జోడు పదవుల సంప్రదాయానికి ముఖ్యమంత్రి జగన్ తెరదించారు. ఒకరికి ఒక పదవే అన్న విధానాన్ని ఆయన నామినేటెడ్ పోస్టుల్లో అమలు చేశారు. తితిదే ఛైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే నియమించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్  గా సుధాకర్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్  గా జోసెఫ్ వెస్లీ, నెడ్ క్యాప్ ఛైర్మన్  గా కేకే రాజు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా గేదెల బంగారు, గ్రంథాలయ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి, హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి, డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన, బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి కి పదవులను కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 135 కార్పొరేషన్ పదవుల్లో 50 శాతం బీసీలకు, 50 శాతం మహిళలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు కార్పొరేషన్, ఛైర్మన్ పదవులు పొందేందుకు జగన్ అవకాశం ఇవ్వలేదు.

పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి కార్పరేషన్ ఛైర్మన్  పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మొదటి ప్రాధాన్యత, ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి రెండో ప్రాధాన్యత కింద అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో 17 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 మందికి అవకాశం కల్పించారు. కడప జిల్లాలో 11 మందికి, విశాఖలో 10 మందికి అవకాశం కల్పించారు.

మునుపటి వ్యాసం