విధుల్లో తీసుకోకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రకటన

కరీంనగర్: హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఈ ఉప ఎన్నికలకు  పోటీ చేయాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకం కింద పనిచేస్తున్న760 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. తమను విధుల్లోకి తీసుకోకపోతే  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతామని వారు ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున తాను ప్రచారం చేస్తానని  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు  ఆర్. కృష్ణయ్య హామీ ఇచ్చారు.