రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్చా, గౌరవం కరువయ్యాయి: ఈటల

నేను కూడా మీ కష్టంలోనూ, సుఖంలోనూ తోడుగా ఉంటానని' వ్యాఖ్య

హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్చా, గౌరవం కరువయ్యాయని మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజా దీవెన యాత్ర పేరిట హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తున్న ఈటల బుధవారం వంగపల్లి గ్రామానికి చేరుకున్నారు. వర్షం కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో వంగపల్లి ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా కాలంలో తప్ప నిరంతరం 20 ఏళ్లుగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్నానని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోందని విమర్శించారు. ఇలా అహంకారపూరితంగా పాలన సాగిస్తున్న కేసీఆర్ ను గెలిపిస్తారా? పేదప్రజల గొంతుక అయిన ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా? అని హుజురాబాద్ ప్రజలను అడిగారు. ''ధర్మాన్ని పాతర వేయవద్దనే ఈ వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్నా. కులం, పార్టీ కంటే జనంతోనే నాకు ఎక్కువ సంబంధం ఉంది. ప్రజలంతా అండగా ఉంటామని అంటున్నారు. నేను కూడా మీ కష్టంలోనూ, సుఖంలోనూ తోడుగా ఉంటానని'' ఈటల పేర్కొన్నారు.