జంతర్ మంతర్ వద్ద రైతుల నిరసనకు అనుమతి

నిరసనకారులెవరూ పార్లమెంట్ వైపు వెళ్లబోరని తెలిపిన రైతు సంఘాలు

న్యూదిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత కొన్ని నెలలుగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు నిరసన తెలిపేందుకు పోలీసులు బుధవారం అనుమతి ఇచ్చారు. పోలీసు ఎస్కార్టుతో రైతులు సింఘూ సరిహద్దుల నుంచి జంతర్ మంతర్‌కు బస్సులలో ప్రయాణించడానికి అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జంతర్ మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తామని, జులై 22 నుంచి ప్రతిరోజు 200 మంది నిరసనకారులు సింఘూ సరిహద్దుల నుంచి హాజరవుతారని రైతు సంఘాలు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని, నిరసనకారులెవరూ పార్లమెంట్ వైపు వెళ్లబోరని తెలిపారు. ఈ నెల 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి.

మునుపటి వ్యాసం