రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఫలితంగా రాష్ట్రమంతటా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ తో సహా నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.