జులై 24న నల్లబెల్లికి ముఖ్యమంత్రి కేసీఆర్

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న ముఖ్యమంత్రి

వరంగల్ రూరల్: ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండల పర్యటన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తేదీ ఖరారు చేసి ఉత్తర్వులను జారీ చేసింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి పితృవియోగం కలగడంతో 24న జరిగే దశదిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి  చేరుకోవడానికి కావాల్సిన రోడ్డు సౌకర్యం, ఇతర వసతులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్‌జోషి, రూరల్ జిల్లా కలెక్టర్ హరితల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనపై ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించారు. ముఖ్యమంత్రి పర్యటన పరిమితంగా కొనసాగే అవకాశం ఉన్నందున ఎక్కువ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా వచ్చేది లేకుండా చూసుకోవాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.