మహారాష్ట్రలో వరదలతో 136 మంది మృతి

84 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు

ముంబయి: నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మహారాష్ట్రను జలమయయం చేసింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 136 మంది చనిపోయారని సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వాడెట్టి  శనివారం తెలిపారు. ఇందులో రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన 36 మంది కూడా ఉన్నారని చెప్పారు. భారీ వర్షాల కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలతో వరదలు వచ్చి రాష్ట్రంలోని పలు రహదారులు నదులను తలపిస్తున్నాయి. కొంకన్‌ రీజియన్‌లోని పలు జిల్లాల్లో గత కొన్నిరోజులుగా భారీవర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వేల మంది వరదల్లో చిక్కుకుపోయరని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 84 వేల మందిని పునరావాస, సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఇందులో కొల్హాపూర్‌కు చెందినవారే 40 వేల మందికిపైగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 54 గ్రామాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయన్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పంచ్‌గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోందని వారు పేర్కొన్నారు.