కశ్మీరీలు పాక్‌లో చేరడంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం: ఇమ్రాన్‌ ఖాన్

ఈ నెల 25 న పీఓకే అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) లో ఎన్నికలు సమీపంలో ఉండటంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌లో చేరాలనుకుంటున్నారా? స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారా? అని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం రాత్రి తెలిపారు. ఈ నెల 25 న పీఓకే అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పీఓకేలో సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో పీఓకేకు చెందిన దాదాపు 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 53 స్థానాల నుంచి దాదాపు 700 మంది బరిలో ఉన్నారు. 2019 లో ఇక్కడి 53 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విద్యుత్‌, గ్యాస్ సరఫరా, రహదారులు వంటి ప్రాథమిక సౌకర్యాలను ఈ ప్రాంత ప్రజలు కోరుతుండటంతో వారిని మభ్యపెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్‌ ప్లెబిసైట్‌ను తెరపైకి తీసుకొచ్చినట్లుగా నిపుణులు అంటున్నారు. సామాన్య ప్రజల దుస్థితిపై చర్చకు బదులుగా కశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి పాకిస్థాన్ ప్రధాని ఎంచుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌పై పైచేయి సాధించేందుకు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ అధినేత నవాజ్‌ షరీప్‌ కుమార్తె మరియం, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ ఇంకోవైపు నుంచి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్శిస్తున్నారు.

మునుపటి వ్యాసం