సెప్టెంబర్‌ నుంచి చిన్నారులకు టీకాలు: ఎయిమ్స్ చీఫ్‌

కొత్త వేరియంట్ల నేపథ్యంలో బూస్టర్ డోసులు అవసరం

న్యూదిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు దిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఆగస్టు-సెప్టెంబర్ నాటికి మూడు కంపెనీల టీకాలకు అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ వ్యాక్సినేషన్‌ పిల్లలను ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరమని డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. దిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ప్రసంగించారు. జైడస్ ట్రయల్స్ పూర్తయ్యాయని, అత్యవసర అనుమతి కోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ ట్రయల్ కూడా ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించిందని తెలిపారు. 

మునుపటి వ్యాసం