ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌: పేదలపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వమే ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ప్రారంభించిందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలపై ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్‌ను ఎమ్మెల్యే సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ప్రారంభించారని చెప్పారు. ఉచిత పరీక్షా కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్‌ ఆలూర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పిప్రి ఎంపీటీసీ సామెర సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.