అక్ర‌మంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల బియ్యం ప‌ట్టివేత‌

ఎస్ఆర్‌.నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో తనిఖీలు

వెంగళరావునగర్: అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యంను పౌరస‌రఫరాల శాఖ అధికారులు సోమవారం దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్‌.నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇంట్లో దాచిన 37 సంచుల్లో ఉన్న సుమారు 16 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

పౌరస‌రఫరాల శాఖ అధికారుల కథనం ప్రకారం...ఎర్రగడ్డ బి.శంకర్‌లాల్‌ నగర్‌లోని ఓ ఇంట్లో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో పౌరసరఫరాల శాఖ డీఎస్ఓ రమేష్‌ అధ్వర్యంలో ఏఎస్ఓ ఇర్ఫాన్‌ అహ్మద్‌, డిప్యూటీ తహసీల్దారు కృష్ణవేణి, ఇన్‌స్పెక్టర్లు అనిల్‌ కుమార్‌, శ్రీనివాసరావులు ఎస్ఆర్‌.నగర్‌ పోలీసులతో కలిసి దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఇంట్లో 37 సంచుల్లో నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా తలాబ్‌కట్టకు చెందిన కుద్బుద్దీన్‌ అనే వ్యక్తి ఇటీవల ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు చేశామని, తదుపరి విచారణ నిమిత్తం ఎస్.ఆర్‌.నగర్‌ పోలీసులకు అప్పగించామని డీఎస్ఓ రమేష్‌ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.