ఐదో టెస్టు రద్దు కావడం దురదృష్టకరం: కోహ్లీ

మరో సిరీస్ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదన్న బీసీసీఐ

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ తో తలపడనున్న ఐదో టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ రద్దు కావడంతో టీమిండియా క్రీడాకారులు లండన్ నుంచి యూఏఈకి వెళ్లారు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ రెండో దఫా మ్యాచుల్లో ఈ ఆటగాళ్లు పాల్గొననున్నారు. మరోవైపు ఐదో టెస్టు రద్దుపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ..మ్యాచ్ ఆగిపోవడం దురదృష్టకరమన్నాడు. యూఏఈలో అయినా బలమైన బయోబబుల్, సురక్షితమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు.

ఇంకోవైపు ఐదో టెస్టు రద్దు కావడంపై ఇంగ్లాండ్  క్రికెట్ బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది. దీని వల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని చెప్పింది. ఈ మ్యాచ్ పై చర్చించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ లండన్ కు వెళ్లనున్నారు. అయితే, ఆగిపోయిన టెస్టు మ్యాచును మాత్రమే తర్వాత కొనసాగించాలని ప్రస్తుత సిరీస్ లో భాగంగానే ఆ మ్యాచ్ జరగాలని గంగూలీ చెప్పారు. మరో సిరీస్ అంటే మాత్రం కుదరదని ఆయన స్పష్టం చేశారు. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే.