మారిన రాయల్‌ ఛాలెంజర్స్‌ జెర్సీ రంగు

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు మార్పు

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 రెండో దశ మ్యాచులు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు జెర్సీ రంగు మారింది. ఈ విషయాన్ని ఆర్సీబీ అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది. సెప్టెంబర్‌ 20 న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తో జరుగనున్న మ్యాచ్‌లో రెడ్‌ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధరించనుంది. 

కోహ్లీ నాయకత్వంలో రెండో ఫేజ్‌ ఐపీఎల్ మ్యాచులు ఆడేందుకు సిద్ధమైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈసారి నీలిరంగు జెర్సీలో దర్శనమివ్వనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో విలువైన సేవలను అందించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మద్దతును ప్రకటిస్తూ ఈ నీలి రంగు జెర్సీని ధరిస్తున్నట్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

‘కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు.. ఫ్రంట్‌లైన్‌ యోధులు ధరించే పీపీఈ కిట్‌ల రంగును పోలి ఉండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది.