హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టులో పిటిషన్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టు మరొక రోజులో తీర్పు ఇచ్చే అవకాశం ఉందని వారి ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. అలాగే హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక కాలువల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్నారు. హుస్సేన్ సాగర్‌లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమే అని అన్నారు. వారి అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. 

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి:
గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు  మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా అనేది తెలంగాణ ప్రభుత్వం ఇష్టమన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచైనా సరే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అనాదిగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కోర్టు తీర్పులను కాదని జల్లికట్టు లాంటి పండుగలను నిర్వహిస్తున్నారని భగవంతరావు అన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. నిమజ్జనం చేసుకోవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. 

మునుపటి వ్యాసం