పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పై హైకోర్టు ఆగ్రహం

21వ శతాబ్దంలో ఉన్నాం.. 16వ శతాబ్దంలో లేమని వ్యాఖ్య

హైదరాబాద్: రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్ఎస్ఎల్‌పీఆర్‌బీ) పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకాలు పూర్తిచేయడానికి మరో నాలుగున్నర నెలల గడువు ఎందుకు అని ప్రశ్నించింది. ప్రభుత్వం గడువు కోరడానికి కూడా ఓ అర్థం ఉండాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

తాజా విచారణలో భాగంగా ఏపీపీల నియామకాలు, పరీక్షల నిర్వహణ కోసం జేఎన్‌టీయూతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నామని, నియామకాల పూర్తికి మరో నాలుగున్నర నెలల గడువు కోరుతూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విజ్ఞప్తి చేసింది. సెప్టెంబరు 5న పరీక్షలు నిర్వహిస్తున్నామని గత విచారణ సందర్భంగా చెప్పినట్లు గుర్తుచేసిన ఏసీజే ఎంఎస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం 10 జ్యుడీషియల్‌ జిల్లాలకే పరిస్థితి ఇలా ఉంటే రేపు 33 జిల్లాలకు కోర్టులు ఏర్పడితే ఏం చేస్తారని ప్రశ్నించింది.

క్రిమినల్‌ కోర్టుల్లో భారీగా కేసులు పెండింగ్‌లో ఉండటం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కొరత అంశాన్ని 2018లో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఏపీపీల నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి పలు మార్లు ఆదేశాలిచ్చింది. ‘పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు లేని కోర్టులు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఒక్కరే రెండు, మూడు కోర్టులకు హాజరవుతున్నారు. 

క్రిమినల్‌ కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందించే అంశంలో మీరు సీరియ్‌సగా ఉన్నట్లు లేరు? జేఎన్‌టీయూ, రిక్రూట్‌మెంట్‌ బోర్డు చాలా నెమ్మదిగా పనిచేస్తున్నాయి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 16వ శతాబ్దంలో లేము. 151 పోస్టుల నియామకానికి ఎన్ని రోజులు కావాలి? మీవల్ల ఎంతమంది జైల్లోనే ఉండిపోతున్నారో తెలుసా?’ అని మండిపడింది. అక్టోబరు 31నాటికి ఏపీపీ పోస్టుల రాత పరీక్షా ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. విచారణను నవంబరుకు వాయిదా వేసింది.