రూ.35 లక్షలకు నీట్‌ ప్రశ్నపత్రం

వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపిణీ చేసిన కాలేజీ అడ్మినిస్ట్రేటర్‌

జైపూర్‌: దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షకు కొన్ని వేల మంది విద్యార్థులు సన్నద్ధం అవుతుంటారు. నీట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం అంత సులువైన  విషయం కాదు. అందుకే కొందరు ప్రబుద్ధులు అడ్డదారులు తొక్కుతుంటారు. అలా అడ్డదారి తొక్కి జైళు ఊచలు లెక్కబెడుతున్న వారు లేకపోలేదు.

తాజాగా రాజస్తాన్‌లో మాత్రం నీట్ పరీక్ష పత్రాన్ని అమ్మకానికి పెట్టారు. సిలబస్‌లో లేని ప్రశ్నలిచ్చారని, భౌతికశాస్త్రంలో సమ్స్‌ చేసి మైనస్‌ మార్కుల్లోకి పోకుండా చాలా ప్రశ్నలు వదిలేసామని మన విద్యార్థులు బాధపడుతుండగా.. జైపూర్‌లోని ఓ ఎనిమిది మందికి మాత్రం ఇవేమీ పట్టవు. ఎందుకంటే వారు లక్షలు పోసి పేపర్‌ కొనుక్కొని బయటి వారి సాయంతో జవాబులు రాయాలనుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

దేశవ్యాప్తంగా నీట్‌ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది. జైపూర్‌లోని రాజస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో కూడా పరీక్ష జరిగింది. అయితే, కాలేజీ అడ్మినిస్ట్రేటర్‌ పరీక్ష పేపర్‌ను ముందే ఫోన్లో కాపీ చేసుకుని సికార్‌లోని ఇద్దరు విద్యార్థులకు వాట్సాప్‌ చేశాడు.

దీని కోసం ఆయన వారి నుంచి రూ.35 లక్షలు తీసుకున్నాడు. పేపర్‌ను బయట జవాబులు రాయించాలని ప్లాన్‌ వేశారు. అయితే, ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసులకు తెలవడంతో వారు కాలేజీ అడ్మినిస్ట్రేటర్‌ ముకేశ్‌ సమోటాతోపాటు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒక అమ్మాయి కూడా ఉన్నట్లు డీసీపీ రిచా తోమర్‌ తెలిపారు. కాలేజీ అడ్మినిస్ట్రేటర్‌ ముకేశ్‌ సమోటా ఫోన్లో పరీక్షాపత్రం ఫొటోను గుర్తించారు. ఏసీపీ రాయ్‌సింగ్‌ ఆధ్వర్యంలో భాన్‌క్రోటా ఎస్‌హెచ్‌ఓ ముకేశ్‌ చౌదరి, చిత్రకూట్‌ ఎస్‌హెచ్‌ఓ పన్నాలాల్‌ జాగిద్‌, డీఎస్‌టీ వెస్ట్‌ ఇంచార్జీ నరేంద్ర కుమార్‌ విచారణ జరుపుతున్నారు.