సాయితేజ్‌ను కాపాడిన వ్యక్తికి భారీ నజరానా..!

స్పందించిన మహ్మద్ ఫర్హాన్‌

హైదరాబాద్: సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సాయి తేజ్ కు కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌ను ప్రశంసిస్తూ భౌతికంగా, సోషల్ మీడియాలో మెసెజ్ లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ నజరానాలు ఇచ్చిందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తనకు ఆప్త మిత్రుడైన సాయితేజ్‌ను కాపాడినందుకు ఫర్హాన్‌కు రామ్ చరణ్ ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దీనిపై మహ్మద్ ఫర్హాన్‌ స్పందిస్తూ... సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించాడు. తనకు ఎవరూ ఎలాంటి బహుమతులు, డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశాడు. అసత్య ప్రచారమే తప్ప అందులో ఎలాంటి నిజం లేదన్నాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుంచి తనకు ఎవరూ ఫోన్ కాల్ చేయలేదని మహ్మద్ ఫర్హాన్ వివరించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించానే తప్ప, తాను ఏమీ ఆశించలేదని ఫర్హాన్ తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని, దయచేసి అలాంటి వార్తలు రాయవద్దని, అసత్య ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. 

హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్​ విడుదల
హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఆయన ఐసీయూలోనే ఉన్నారని, వైద్యనిపుణులు అతన్ని పరిశీలిస్తారని తెలిపారు.