సైదాబాద్ హత్యాచార నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు

హైదరాబాద్ నగర పోలీసుల ప్రకటన

హైదరాబాద్: సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటన రాష్ట్రమంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన నాటి నుంచి నిందితుడి ఆచూకీ లభించలేదు. నిందితుడు పల్లకొండ రాజు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజు తన మిత్రుడితో కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు రాజు స్నేహితుడిని సైతం విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా విచారణలో రాజు ఎక్కడున్నాడన్న విషయం బయటకు రాలేదు. దీంతో నిందితుడి కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని పట్టించిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. నిందితుడి ఆచూకి తెలిసిన వారు 9490616366 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోలీసులు ఇంత భారీ మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖాలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయినా నిందితుడి ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు ప్రకటించారు.