వరంగల్ లో రేపట్నుంచి జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ పోటీలు

రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా నిర్వాహణ

వ‌రంగ‌ల్: 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ (ఎన్ఓఏసీ)-2021 కు ద్వితీయ శ్రేణి న‌గ‌రం వ‌రంగ‌ల్ ఆతిధ్యం ఇవ్వ‌నుంది. ఈ పోటీలు రాష్ట్ర క్రీడా చ‌రిత్ర‌లో తొలిసారిగా వరంగల్ లో జరగనున్నాయి. ఐదురోజుల పాటు జ‌రిగే ఈ ఆటలు బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్నట్లు స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణా స్టేట్ (శాట్స్‌) వెల్లడించింది. 

అథ్లెటిక్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా, శాట్స్‌, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేష‌న్ అండ‌దండ‌ల‌తో వరంగ‌ల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేష‌న్ ఈ మెగా ఈవెంట్‌ను నిర్వ‌హిస్తోంది. హ‌నుమ‌కొండ బ‌స్‌స్టేష‌న్ స‌మీపంలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రేపట్నుంచి (సెప్టెంర్ 15) నుంచి 19 వ‌ర‌కూ ప్రతిష్టాత్మ‌క క్రీడా ఈవెంట్ జ‌రుగుతుంది. ఈ పోటీల్లో ఆల్ ఇండియా పోలీస్‌, రైల్వేస్‌, ఎల్ఐసీ వంటి యూనిట్ల‌తో పాటు 21 రాష్ట్రాల నుంచి 519 మంది క్రీడాకారులు ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో పాల్గొంటార‌ని అథ్లెటిక్స్ అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షులు ఎర్ర‌బెల్లి వ‌ర‌ద‌రాజేశ్వ‌రరావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంత‌ర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య ప్ర‌మాణాల‌కు అనుగుణంగా రూ 7.50 కోట్ల‌తో స్టేడియంలో ఎనిమిది లేన్ల‌తో 400 మీట‌ర్ల సింథ‌టిక్ ట్రాక్ నిర్మాణం చేప‌ట్ట‌డంతో ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించే అవ‌కాశం ద‌క్కింద‌ని వెల్ల‌డించారు.

ఆయనతో పాటు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే, (ఎన్ఓఏసీ)-2021 ఆర్గ‌నైజింగ్ క‌మిటీ చైర్మ‌న్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ...రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ జేఎన్ఎస్‌లో సింథ‌టిక్ ట్రాక్ నిర్మాణానికి స‌హ‌క‌రించార‌ని ఇది రాబోయే రోజుల్లో స్ధానిక యువ‌త క్రీడ‌ల్లో స‌త్తా చాటేందుకు ఉప‌క‌రిస్తుంద‌ని  అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి మ‌రెన్నో జాతీయ స్ధాయి క్రీడా ఈవెంట్ల‌ను తాము నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు.