పది పోలీసు బృందాలతో నిందితుడి కోసం గాలింపు: మంత్రి సత్యవతి రాథోడ్

కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ

మహబూబాబాద్: సైదాబాద్ కాలనీలో చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పనులు, మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి  సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలో నర్సింగ్ కాలేజీకి రూ.30 కోట్లతో టెండర్ పూర్తి అయ్యిందని తెలిపారు.

నర్సింగ్ కాలేజీ పూర్తి చేశాక అందులో ముందు మెడికల్ కాలేజీ నడిపిస్తామన్నారు. ఏరియా హాస్పిటల్ లో 300 పడకల ఏర్పాటు చేశామని అన్ని సర్వీసులు అక్కడ మొదలు పెడుతున్నామని మంత్రి చెప్పారు. దాంతో పాటు సైదాబాద్ ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ, సీపీలతో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని చెప్పారు. కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.       

బాలికపై హత్యాచార ఘటన: 
సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటన రాష్ట్రమంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన నాటి నుంచి నిందితుడి ఆచూకీ లభించలేదు. నిందితుడు పల్లకొండ రాజు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజు తన మిత్రుడితో కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు రాజు స్నేహితుడిని సైతం విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా విచారణలో రాజు ఎక్కడున్నాడన్న విషయం బయటకు రాలేదు. దీంతో నిందితుడి కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని పట్టించిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. నిందితుడి ఆచూకి తెలిసిన వారు 9490616366 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోలీసులు ఇంత భారీ మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖాలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయినా నిందితుడి ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు ప్రకటించారు. 

మునుపటి వ్యాసం