సింగరేణి హత్యాచార ఘటన నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు

ఉప్పల్ లో నిందితుడి కదలికలు గుర్తింపు

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌లో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజును పట్టుకోవడానికి పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగాదర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజు ఉప్పల్‌ వరకు వెళ్లినట్టు సీసీ పుటేజ్‌లో గుర్తించారు.

ఉప్పల్‌ సిగ్నల్‌లోని  ఓ మద్యం దుకాణం వద్ద నిందితుడు కవర్‌ని పడేసాడు. దానిని గుర్తించిన పోలీసులు  కవర్‌లోని కల్లు సీసా, టవల్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు రాజు చేతిలో రూ.700 ఉన్నట్లు సీసీ పుటేజ్‌ ద్వారా వారు గుర్తించారు. ప్రస్థుతం నిందితుడు రాజుకోసం నగరంలోని దాదాపు 180 మద్యం దుకాణాల వద్ద పోలీసులు మఫ్టీలో నిఘా కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు హైవేలను జల్లెడ పడుతున్నారు. హైవేలను తనిఖీ చేసేందుకు వెయ్యి మంది టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ఎస్‌వోటీ బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. రాత్రిలోగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

పవన్ కల్యాణ్ పరామర్శ:
హత్య ఘటనలో సైదాబాద్‌ చిన్నారి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతని  తెలిపారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసినప్పుడే పోలీసులు స్పందించాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. దోషికి కఠిన శిక్ష పడే వరకూ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్‌ పేర్కొన్నారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే ఆలోచించి చేయాల పవన్‌ అన్నారు.