సైదాబాద్ ఘటన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య

ధృవీకరించిన డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ఈ నెల 9న నగరంలోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డి  నిందితుడు తప్పించుకు తీరుగుతున్న విషయం తెలిసిందే. నిందితుడిగా ఉన్న రాజు కోసం పోలీసులు రూ.10 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. అయితే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని నక్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది రాజనే నిర్ధారించారు. ఈ మేరకు రాజు మృతిని డీజీపీ మహేందర్ రెడ్డి ధృవీకరించారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడు కోణార్క్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే కార్మికులు వివరించారు. 

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 9 నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రాజు కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి ఆటోలు, బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పౌరులు సైతం అతని ఆచూకి కోసం సామాజిక మాధ్యమాల్లో అతని ఫోటోను వైరల్ చేశారు. కాగా, పోలీసులు రాజు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యాక్తం చేశారు. అందుకు తగినట్లుగానే రాజు ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. 
 
ప్ర‌స్తుతం సింగ‌రేణి కాల‌నీలో పోలీసులు భారీగా మోహ‌రించారు. దాదాపు 500 మంది ఉన్నారు. అక్క‌డ‌ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌నలు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా,  సెప్టెంబ‌రు 9న‌ సింగ‌రేణి కాల‌నీలోని ఆరేళ్ల బాలిక అదృశ్య‌మైంది. చివ‌ర‌కు ఆమె నివ‌సించే ప‌క్కింట్లో ఉండే రాజు అనే యువ‌కుడి ఇంట్లో ఆమె మృత‌దేహం లభ్య‌మైంది. అప్ప‌టికే రాజు ఆ ఇల్లు వ‌దిలి పారిపోయాడు. బాలిక‌పై రాజు లైంగికదాడికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత హత్య చేసి, అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని స్థానికులు ఆరోపించి, పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు.