ఏడు గంటల పాటు ముమైత్ ఖాన్ ను ప్రశ్నించిన ఈడీ

మాదక ద్రవ్యాల కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ప్రశ్నలు

హైదరాబాద్: టాలీవుడ్ మాదక ద్రవ్యాలు, మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుంతోంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ముమైత్ ఖాన్ నిన్న ఈడీ ముందుకు హాజరు కాగా, ఆమెను దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. అయితే ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జీషాన్, కెల్విన్ లతో గల ఆర్థిక సంబంధాలపై ఆమెను ప్రశ్నించారు. 

ఈ మేరకు ముమైత్ ఖాన్ ఈడీ అధికారులు వేసిన ప్రశ్నలకు స్పందించింది. తన స్నేహితులతో కలిసి హైదరాబాదులో తాను కొన్ని పార్టీల్లో పాల్గొన్నానని, కెల్విన్, జీషాన్ లు తనకు అక్కడే తెలుసని అయితే, వారితో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఆమె చెప్పింది.  ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించలేదని వివరించింది. 

తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఈడీ అధికారులకు ముమైత్ అందించింది. మరోవైపు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ముమైత్ నుంచి ఈడీ అధికారులు వివరణ తీసుకున్నారు. హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు ముమైత్ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ అధికారులు ప్రశ్నించగా అవి కేవలం పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ముమైత్ సమాధానమిచ్చింది. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్, రవితేజ, నందు, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్, రానా, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, ఎఫ్ క్లబ్ మేనేజర్ లను ఈడీ విచారించింది. ఈరోజు మరో హీరో తనీశ్ ను విచారించనున్నారు. ఈ నెల 22న చివరగా తరుణ్ ను ప్రశ్నించబోతున్నారు.