హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు

చివరి సారిగా మినహాయింపు ఇస్తున్నట్లు తీర్పు

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రాహల నిమజ్జనం కారణంగా నీటి కాలుష్యం పెరుగుతుందని అందుకు నిమజ్జనం చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విగ్రహాల నిమజ్జనం కోసం 22 చిన్న చెరువులను ప్రభుత్వం సిద్ధం చేసిందని, కానీ అందులో పెద్ద విగ్రహాల నిమజ్జనం సాధ్యం కాదని వివరించారు. ఈ మేరకు ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ... ఈ విషయంలో ప్రభుత్వం తీరు సంతృప్తి కరంగా లేదని అన్నారు.

ఈ సమస్య కొత్తగా వచ్చింది కాదని ఎప్పటి నుంచో ఉందన్నారు. ప్రత్యామ్నయం లేదా అని ప్రశ్నించారు. వెంటనే చెత్తనంతా క్లియర్ చేయాలని వివరించారు.  హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వానికి చివరి సారి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్ ప్యారిస్‌ విగ్రహాల నిమజ్జనానికి ఇదేచివరి అవకాశమన్నారు. నిమజ్జనానికి ఆధునిక క్రేన్లు వినియోగించాలన్నారు. హుస్సేన్ సాగర్‌ను ఒకప్పుడు మంచినీటి కోసం వాడేవారని గుర్తు చేశారు. సాగర్ ఆధునీకరణకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది నిమజ్జనం పేరిట దాన్ని కాలుష్యం చేస్తే ప్రజాధనం వృథా అయినట్టు కాదా అని ఎన్వీ రమణ ప్రశ్నించారు.

మునుపటి వ్యాసం