టీ20 ర్యాకింగ్స్ లో నాలుగో ర్యాంక్‌కే పరిమితమైన కోహ్లి

కెఎల్ రాహుల్ స్థానం పదిలం

దుబాయి: టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, కెఎల్.రాహుల్‌లు తమ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 717 పాయింట్లతో కోహ్లి ఈ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు రాహుల్ 699 పాయింట్లతో ఆరో ర్యాంక్‌ను కాపాడుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) బుధవారం తాజాగా ర్యాంకింగ్ లను వెల్లడించింది. 

ఇదిలావుండగా ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మలాన్ 841 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 819 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మలాన్ కంటే బాబర్ చాలా పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.

దీంతో సమీప భవిష్యత్తులో మలాన్ టాప్ ర్యాంక్‌కు ఎలాంటి ఆటంకం ఉండదనే చెప్పాలి. కాగా, భారత క్రికెటర్లు చాలా కాలంగా అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడడం లేదు. దీంతో దీని ప్రభావం ర్యాంక్‌లపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగిన కోహ్లి ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌కే పరిమితమయ్యాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ అరోన్ ఫించ్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాడు కాన్వే ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 

బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ శంసీ 775 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కొంతకాలంగా శంసీ టి20లలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీలంక స్పిన్నర్ వానిండు హసరంగా 747 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కాగా, భారత బౌలర్లు ఒక్కరూ కూడా టాప్10లో చోటు సంపాదించలేక పోయారు. భువనేశ్వర్ కుమార్ 12వ, వాషింగ్టన్ సుందర్ 18వ ర్యాంక్‌లో నిలిచారు. మిగతా బౌలర్లు ఎవరూ కూడా కనీసం టాప్20లో కూడా నిలువలేక పోయారు.

మునుపటి వ్యాసం