ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం లోకి వస్తుందని ధీమా

హైదరాబాద్‌: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేశారన్నారు. అదే విధంగా రికార్డు మెజారిటీతో  పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

తెరాస పాలనలో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. వచ్చే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం లోకి వస్తుందని ధీమావ్యక్తం చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి,  ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.