విశ్రాంతి కోసమే టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై: విరాట్ కోహ్లీ

వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం

హైదరాబాద్: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లి ట్విటర్‌ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఇది జరగనుందని, వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులు, లీడర్‌షిప్‌ గ్రూపులో కీలకమైన రవి భాయ్‌, రోహిత్‌తో కూడా చర్చించానని పేర్కొన్నారు. 

‘‘భారత క్రికెట్ బృందానికి ప్రాతినిథ్యం వహించడమే కాకుండా జట్టు సారథ్యుడిగా ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ, నా కోచ్‌లు, ప్రతీ భారతీయుడికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదన్నారు.

గత 5-6 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ కారణంగా వర్క్‌లోడ్‌ ఎక్కువైందని కాస్త విశ్రాంతి కోరుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్‌గా నా మేరకు ఇచ్చాను. ఇకపై బ్యాట్స్‌మెన్‌గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతానన్నారు". ఇదిలా ఉండగా కోహ్లి నిర్ణయంతో వైఎస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ  టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది.

మునుపటి వ్యాసం