కేంద్ర కేబినెట్ ఇచ్చిన అండతో సూచీలు పైపైకి

సెన్సెక్స్ 59,141 పాయింట్లు, నిఫ్టీ 17,630 పాయింట్ల వద్ద ట్రేడింగ్

హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు తొలి గంటలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఆ తర్వాత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు పెరిగి 59,141కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు 17,630కి చేరుకుంది.

వాహన, టెలికాం రంగాలకు కేంద్ర కేబినెట్ ఇచ్చిన అండతో బుధవారం జీవనకాల గరిష్ఠాలను సూచీలు తాకాయి. గురువారం ట్రేడింగ్ లోనూ అదే దూకుడును కనబరిచాయి. ప్రధానంగా నిఫ్టీ పీసీయూ బ్యాంక్‌ సూచీ 5.43 శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీ 2.67 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 2.22 శాతం లాభాన్ని చవిచూసింది.

బీఎస్‌ఈలో సుమారు 400 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్‌ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 73.52గా నమోదైంది. నిఫ్టీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారత్‌ పెట్రోలియం, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

మునుపటి వ్యాసం