కరోనా కట్టడిలో ఉన్నప్పటికీ..జాగ్రత్తలు అవసరం: ఎర్రబెల్లి

కేసీఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ టీకా డ్రైవ్

వ‌రంగ‌ల్: రాష్ట్రంలో ప్రస్థుతం కరోనా పూర్తి కట్టడిలో ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో గురువారం మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కార్య‌క్ర‌మాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... ప్ర‌తి ఒక్క‌రూ కరోనా టీకా వేయించుకోవాలని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.

కరోనా నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణలో ప్రతిరోజు 3 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలన్నారు.