గౌడ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు

వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం

హైదరాబాద్‌: మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతాల్లో రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పేర్కొంది.

గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం దాదాపు ఆరు గంటలపాటు కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. పలు అంశాలపై సబ్ కమిటీలను తెలంగాణ కేబినెట్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు మరో రూ.100 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.300 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని దశల వారిగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్‌ షిప్‌లు, ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్‌, వైన్‌షాప్‌లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా దళితబంధు ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.