అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

ప్రతి ఏడాది సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంను నిర్వహిస్తున్నాయి

సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమిపై నేరుగా వచ్చి పడకుండా ఉండేందుకు ఓజోన్ పొర కాపాడుతుంది. ఒక వేళ ఈ కిరణాలు నేరుగా జీవరాశులపై పడితే వాటి మనుగడ ప్రమాదకరంగా మారుతుంది. అవే కిరణాలు మనిషి శరీరంపై పడితే వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగకుండా మనందర్నీ ఓజోన్ పొర కాపాడుతోంది.

అయితే ఈ ఓజోన్ పొర దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణంలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర దెబ్బతింటోందన్న విషయమై 1970 నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. 1975లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతినడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నానాటికీ అది పలుచన అవుతూ 1987 నాటికి తీవ్రంగా దెబ్బతింది. మానవులు చేసే తప్పిదాల వల్ల వచ్చే ప్రమాదకర వాయువులు, రసాయనాలే ఓజోన్ పొరను దెబ్బతీశాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి దాన్ని రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంను నిర్వహిస్తున్నాయి.

ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న 100 రకాల ఉత్పత్తులను వాడకుండా చేసేందుకు ప్రపంచ దేశాల మధ్య మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు సెప్టెంబర్ 15, 1987న ఆమోదించాయి. అయితే ఏటా సెప్టెంబర్ 16 నుంచి ఓజోన్ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 1994 లో ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా అయింది. ఈ దినోత్సవం నాడు ఓజోన్ పొరను ఎలా కాపాడాలనే అంశంపై ప్రపంచ దేశాలు అవగాహన కల్పిస్తున్నాయి. 

మునుపటి వ్యాసం