తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

సెప్టెంబర్ 17 తెలంగాాణ విమోచన దినోత్సవం

1947 ఆగస్టు 15న  భారతదేశానికి స్వాతంత్రం లభించింది. యావత్ దేశమంతటా స్వాతంత్ర సంబురాలు జరుపుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటి నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర ఫలాలు అందలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. అందులో నిజాం సంస్థానం కూడా ఒకటి. అయితే ప్రస్థుత తెలంగాణ రాష్ట్రం వలే కాకుండా అప్పటి నిజాం సంస్థానం చాలా పెద్దది.

తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు, కర్ణాటకలోని మూడు జిల్లాలు కూడా ఇందులో కలిసి ఉండేవి. బ్రిటీష్ పాలకులు వెళ్తూ.. వెళ్తూ సంస్థానాలు భారతదేశంలో కలిసి పోవాలా లేక స్వతంత్రంగా ఉండాలో  నిర్ణయాన్ని మాత్రం సంస్థానాధిపతులకే ఇచ్చారు. ఫలితంగా మూడు సంస్థానాలు భారత దేశంలో విలీనం కాలేదు. అలా భారత్ లో విలీనం కాకుండా ఉన్న సంస్థానాల్లో కాశ్మీర్, జునాఘడ్ మరియు హైదరాబాద్ మాత్రమే. 

అయితే అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ ఇటు భారత్ లో, అటు పాకిస్థాన్ లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని స్పష్టం చేశాడు. కానీ సంస్థానంలోని ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు.

దాంతో తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకుని, హత్యాకాండను కొనసాగించారు. 

నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ దిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురేస్తానని వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాలు చేశాయి.  ఉస్మాన్ అలీఖాన్ ఈ పోరాటాలను అణచివేస్తూ, ఆయా సంస్థలన్నింటినీ నిషేధించాడు. భారతదేశ నడిబొడ్డున క్యాన్సర్ కణతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిశ్చయించుకున్నారు.

పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం 'ఆపరేషన్ పోలో' పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి 'పోలీస్ యాక్షన్' అనే పేరు పెట్టారు.హైదరాబాద్ రేడియో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైందని నిజాం ప్రకటించాడు. ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.