రికార్డు స్థాయిలో నిమిషానికి 42 వేల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పుట్టిన‌రోజు సందర్భంగా రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ల పంపిణీ ప్రక్రియ

న్యూదిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పుట్టిన‌రోజు సందర్భంగా రికార్డు వ్యాక్సినేష‌న్లే ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్ర‌భుత్వం శుక్ర‌వారం నిమిషానికి 42 వేల వ్యాక్సిన్ డోసులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో మధ్యాహ్నం 1.30 గంట‌ల‌కే కోటి డోసుల మార్క్‌ను దాటేసిన‌ట్లు ఓ సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు. నెల రోజుల్లోనే ఒకే రోజు కోటికి పైగా డోసులు ఇవ్వ‌డం ఇది నాలుగోసారి, ఈ వేగం రానున్న కొత్త రికార్డుల‌కు సూచిక అని ఆ అధికారి అన్నారు. ఈ లెక్క‌న శుక్ర‌వారం ఒక్క రోజే 2.5 కోట్ల డోసుల మార్క్ అందుకునే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వ‌ర్గాలు తెలిపాయి.

శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీ త‌న 71వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా 2 కోట్ల డోసుల‌ను ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. నిమిషానికి 42 వేలు, సెక‌నుకు 700 డోసులు ఇస్తున్న‌ట్లు నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆరెస్ శర్మ ట్వీట్ చేశారు. అటు బీజేపీ కూడా మోదీ బ‌ర్త్ డే నుంచి మూడు వారాల పాటు వ్యాక్సినేష‌న్ సంబురాలు జ‌ర‌ప‌డానికి ప్ర‌ణాళిక వేసింది.

దేశంలో కొత్తగా 34 వేల కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే  నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు.. గురువారం మళ్లీ ముప్పై వేలు దాటినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఇవి గురువారం నాటికంటే 12.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 3,49,056 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,25,98,424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇందులో కొత్తగా 37,950 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో 77.24 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

మునుపటి వ్యాసం