సాధించాలనుకున్నవన్నీ సాధించాను: భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి

ఎవ‌రైనా ఆహ్వానించిన మీదట అక్క‌డే ఎక్కువ కాలం ఉండ‌వద్ద‌ని వ్యాఖ్య

లండ‌న్‌: దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచకప్ అనంతరం భార‌త జ‌ట్టు కోచింగ్ బాధ్య‌త‌ల నుంచి ర‌విశాస్త్రి త‌ప్పుకోనున్న‌ట్లు క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఓవ‌ల్‌లో నాలుగ‌వ టెస్టుకు ముందు ఓ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొని కరోనా పాజిటివ్ గా తేలిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు భారత సిబ్బందికి కూడా వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో ర‌విశాస్త్రిపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దీనిపై స్పందిచిన ఆయన కరోనా బారిన పడిన తర్వాత ఇంగ్లాండ్ లో ప‌ది రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్నారన్నారు. ఆ ప‌ది రోజుల్లో త‌న‌కు ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, కేవ‌లం గొంతు నొప్పి ఒక్క‌టే ఉండేద‌ని చెప్పారు. అధిక శరీర ఉష్ణోగ్రత తక్కువేనని, త‌న ఆక్సిజ‌న్ ఎప్పుడూ 99 శాతం చూపించింద‌న్నారు. ఐసోలేష‌న్‌లో ఉన్న ప‌ది రోజుల పాటు తానేమీ మందులు వాడ‌లేద‌న్నారు. క‌నీసం ఒక్క పారాసిట‌మాల్ కూడా వేసుకోలేద‌న్నారు.

రెండు డోసుల టీకాలు వేసుకుంటే, ఆ ప‌ది రోజులు కేవ‌లం ఫ్లూ మాత్ర‌మే ఉంటుంద‌ని శాస్త్రి తెలిపారు. అంతే కాకుండా ఎవ‌రైనా ఆహ్వానించిన మీదట అక్క‌డే ఎక్కువ కాలం ఉండ‌వద్ద‌ని ర‌విశాస్త్రి అన్నాడు.  అయితే తాను ఏం సాధించాల‌నుకున్నానో, అవిన్నీ సాధించిన‌ట్లు తెలిపారు. టెస్టు క్రికెట్‌లో భారత్ ను అయిదేళ్ల పాటు మొదటి స్థానంలో ఉంచిన‌ట్లు చెప్పారు.

ఆస్ట్రేలియాను త‌న స్వంత దేశంలో రెండు సార్లు ఓడించామ‌ని, ఇంగ్లాండ్ తో సిరీస్‌లోనూ లీడ్ ఉన్న విష‌యాన్ని మైఖేల్ అర్థ‌ట‌న్‌కు చెప్పిన‌ట్లు ర‌విశాస్త్రి గుర్తు చేశారు. టెస్టుల్లో అన్ని దేశాల‌పై విజ‌యం సాధించామ‌ని, ఇక టీ20 ప్రపంచ కప్ గెలిస్తే అద్భుత‌మే అని, అనుకున్న దానిక‌న్నా ఎక్కువే సాధించిన‌ట్లు ర‌విశాస్త్రి వివరించారు.